రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) నూతన సారథిగా యువ బ్యాటర్ రజత్ పటీదార్‌ను నియమించడంపై ఈ జట్టు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సరైనోడినే ఫ్రాంచైజీ కెప్టెన్‌గా ఎంపిక చేసిందని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నారు. ఆర్‌సీబీ నయా సారథి రజత్ పటీదార్‌కు తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ఐపీఎల్ 2025 సీజన్‌లో ఆర్‌సీబీని రజత్ పటీదార్ నడిపిస్తాడని బుధవారం ఆ జట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే.
ఫాప్ డుప్లెసిస్‌ను వదిలేయడంతో..
విరాట్ కోహ్లీ అనంతరం సౌతాఫ్రికా దిగ్గజ బ్యాటర్ ఫాఫ్ డుప్లెసిస్ ఆర్‌సీబీ సారథ్య బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. గత మూడు సీజన్లలో అతనే జట్టును నడిపించాడు. అయితే ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఆర్‌సీబీ.. ఫాఫ్ డుప్లెసిస్‌ను రిటైన్ చేసుకోలేదు. వేలంలోనూ తిరిగి కొనుగోలు చేసే ప్రయత్నం చేయలేదు. దాంతో కొత్త సారథిని ఎంపిక చేయాల్సిన పరిస్థితి ఆర్‌సీబీకి ఏర్పడింది. అయితే జట్టులోని సీనియర్ ఆటగాళ్లను కాదని ఆర్‌సీబీ.. రజత్ పటీదార్‌ను ఎంపిక చేసింది.

సంతోషంలో అభిమానులు
ఈ నిర్ణయాన్ని మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు ఆర్‌సీబీ అభిమానులు స్వాగతిస్తున్నారు. రజత్ పటీదార్ సారథ్యంలో ఆర్‌సీబీ మెరుగైన ప్రదర్శన చేస్తుందని ఆకాంక్షిస్తున్నారు. ఇప్పటికే ఆర్‌సీబీని నడిపించే సామర్థ్యం రజత్ పటీదార్‌కు ఉందని విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డాడు. అతనికి తాము అండగా ఉంటామని, అభిమానులు కూడా మద్దతు ఇవ్వాలని కోరాడు. మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ సైతం రజత్ పటీదార్‌కు అభినందనలు తెలియజేశాడు. ఆర్‌సీబీ వంటి జట్టుకు సారథ్యం వహించే అవకాశం దక్కడం గొప్ప విషయమని అభిప్రాయపడ్డాడు.
అభిమానులు సైతం రజత్ పటీదార్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయడాన్ని స్వాగతిస్తూ సోషల్ మీడియా వేదికగా వేల పోస్ట్‌లు పెడుతున్నారు. 'నో పీఆర్, నో జిమ్మిక్స్.. ప్యూర్ క్లాస్ బ్యాటర్ మా ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పటీదార్'అని కొనియాడుతున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కెప్టెన్‌ను మార్చడం ఎలానో మార్చాలో ఆర్‌సీబీని చూసి నేర్చుకోవాలని ఇతర ఫ్రాంచైజీలకు హితవు పలుకుతున్నారు.
రిప్లేస్‌మెంట్ ఆటగాడిగా వచ్చి..
ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆర్‌సీబీలోకి వచ్చిన రజత్ పాటిదార్ 4 మ్యాచ్‌ల్లో 71 పరుగులే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ పేలవ ప్రదర్శనతో తర్వాతి ఐపీఎల్ 2022 సీజన్‌లో అన్‌సోల్డ్‌గా మిగిల్చాడు. ఐపీఎల్ 2022 సీజన్‌లో గాయపడిన ఓ ఆటగాడికి రిప్లేస్‌మెంట్ ప్లేయర్‌గా ఆర్‌సీబీలోకి వచ్చి రజత్ పటీదార్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. ప్లే ఆఫ్స్‌లో సెంచరీ బాది ఈ ఘనత సాధించిన తొలి అనామక ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు.
గాయంతో ఐపీఎల్ 2023 సీజన్ ఆడని రజత్ పటీదార్.. ఐపీఎల్ 2024 సీజన్‌లో 15 మ్యాచ్‌ల్లో ఐదు హాఫ్ సెంచరీలతో 395 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు 27 మ్యాచ్‌లు ఆడి 34.74 సగటుతో 799 పరుగులు చేశాడు. దేశవాళీ క్రికెట్‌లో మధ్యప్రదేశ్‌కు సారథిగా వ్యవహరిస్తున్న రజత్ పటీదార్.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 10 మ్యాచ్‌ల్లో 428 పరుగులు చేశాడు.