ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)కు మరో ఓటమి ఎదురైంది. సొంతగడ్డపై ఆ జట్టు హ్యాట్రిక్ పరాజయాన్ని మూటగట్టుకుంది. పంజాబ్ కింగ్స్‌తో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా శుక్రవారం వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 14 ఓవర్లకు కుదించగా.. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ 9 వికెట్లకు 95 పరుగులే చేసింది.
టీమ్ డేవిడ్ ఒక్కడే..
టీమ్ డేవిడ్ ఒక్కడే(26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లలో రజత్ పటీదార్(18 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 23) మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ చేశాడు. విరాట్ కోహ్లీ(1), ఫిల్ సాల్ట్(4), లివింగ్ స్టోన్(4), జితేశ్ శర్మ(2), కృనాల్ పాండ్యా(1) తీవ్రంగా నిరాశపరిచారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(2/23), మార్కో జాన్సెన్(2/10), యుజ్వేంద్ర చాహల్(2/11), హర్ప్రీత్ బ్రార్(2/25) రెండేసి వికెట్లు తీయగా.. గ్జేవియర్ బార్ట్‌లెట్ ఒక వికెట్ పడగొట్టాడు.
అనంతరం పంజాబ్ కింగ్స్ 12.1 ఓవర్లలో 5 వికెట్లకు 98 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. నెహాల్ వధేరా(19 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 33 నాటౌట్) రాణించాడు. ఆర్‌సీబీ బౌలర్లలో జోష్ హజెల్ వుడ్(3/14) మూడు వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్(2/26) రెండు వికెట్లు పడగొట్టాడు.

కొంపముంచిన చాహల్..
ఆర్‌సీబీ మాజీ ఆటగాడైన యుజ్వేంద్ర చాహల్ అసాధారణ ప్రదర్శనతో చెలరేగాడు. 3 ఓవర్లు బౌలింగ్ చేసిన చాహల్ ఒక్క బౌండరీ ఇవ్వకుండా 3.66 ఎకానమీతో క్రీజులో సెట్ అయిన రజత్ పటీదార్, డేంజరస్ జితేశ్ శర్మలను ఔట్ చేసి ఆర్‌సీబీ పతనాన్ని శాసించాడు. మిడిల్ ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఆర్‌సీబీ బ్యాటర్లను ఒత్తిడికి గురి చేశాడు. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఓటమికి ప్రధాన కారణమయ్యాడు. ఈ పిచ్‌పై పంజాబ్ బ్యాటర్లు తడబడినా.. చాహల్ తరహాలో ఆర్‌సీబీ స్పిన్నర్లు రాణించలేకపోయారు.
ఆర్‌సీబీ పాలోడే..
తన పాత ఫ్రాంచైజీపై చాహల్ తనదైన శైలిలో రివేంజ్ తీర్చుకున్నాడు. ఆర్‌సీబీ తరఫున చాహల్ 8 ఏళ్ల పాటు ఆడాడు. 2014 నుంచి 2021 వరకు ఆర్‌సీబీలో కొనసాగిన చాహల్.. ఆ జట్టు తరఫున 113 మ్యాచ్‌లు ఆడి 139 వికెట్లు తీసాడు. ఆర్‌సీబీని వదిలి 4 ఏళ్లు అవుతున్నా.. ఇంకా ఆ జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చాహల్ కొనసాగుతున్నాడు. బ్యాటింగ్ సామర్థ్యం లేదనే కారణంతో చాహల్‌ను ఆర్‌సీబీ వదిలేసింది.
ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలంలోనూ పట్టించుకోలేదు. కానీ అతను అసాధారణ ప్రదర్శనతో తన విలువ ఏంటో తెలియజేశాడు. ఈ క్రమంలోనే ఆర్‌సీబీ పాలోడే పగోడయ్యాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. చాహల్ అద్భుత ప్రదర్శనను కొనియాడుతున్నారు. చాహల్‌ను వదిలేసి ఆర్‌సీబీ తప్పిదం చేసిందని అభిప్రాయపడుతున్నారు. ఈ సీజన్‌లో తమ పాత ఫ్రాంచైజీలపై ఆటగాళ్లు చెలరేగుతున్నారు. కానీ ఆర్‌సీబీలోని జితేష్ శర్మ, లియామ్ లివింగ్ స్టోన్‌లు మాత్రం పంజాబ్ కింగ్స్‌పై పగ తీర్చుకోలేకపోయారు.