ప్రపంచ క్రికెట్‌లో ఐపీఎల్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. గత 18 ఏళ్లుగా భారత అభిమానులనే కాకుండా యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఈ క్యాచ్ రిష్ లీగ్ అలరిస్తోంది. ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెట్ లీగ్‌గా నిలిచిన ఐపీఎల్.. అభిమానులకు ఎన్నో మధుర జ్ఞాపకాలను మిగిల్చింది. అయితే ఐపీఎల్ 2020 సీజన్ మాత్రం అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేసింది. ఈ సీజన్‌లో ఏకంగా నాలుగు మ్యాచ్‌ల్లో సూపర్ ఓవర్లు ఆడించాల్సి వచ్చింది. ఒక మ్యాచ్‌లో అయితే క్రికెట్ చరిత్రలోనే కనివీని ఎరుగని రీతిలో డబుల్ సూపర్ ఓవర్ ద్వారా ఫలితం తేల్చారు.
సూపర్ ఓవర్‌కే సూపర్ ఓవర్..
కింగ్స్ ఎలెవన్ పంజాబ్(పంజాబ్ కింగ్స్), ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఆ డబుల్ సూపర్ ఓవర్ మ్యాచ్.. ఐపీఎల్ చరిత్రలోనే నిలిచిపోయింది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు 176 పరుగులే చేయడంతో సూపర్ ఓవర్ ఆడించాల్సి వచ్చింది. తొలి సూపర్ ఓవర్‌లోనూ ఇరు జట్లు 5 పరుగులే చేశాయి. దాంతో ఉత్కంఠ తారా స్థాయికి చేరింది. సవరించిన నిబంధనల ప్రకారం రెండో సూపర్ ఓవర్ ఆడించగా.. ముంబై 11 పరుగులు చేయగా.. పంజాబ్ కింగ్స్ 4 బంతుల్లోనే 15 పరుగులు చేసి గెలుపొందింది.

గోళ్లు కొరుకుతూ మెరిసిన బ్యూటీ..
ఉత్కంఠకే ఊపిరి సడలని ఈ మ్యాచ్‌లో గోళ్లు కొరుకుతూ అమయాకంగా టీవీ స్క్రీన్‌పై మెరిసిన ఓ అమ్మాయి.. టాక్ ఆఫ్ ది నేషన్‌గా నిలిచింది. ఆ మ్యాచ్ ఫలితం కంటే సదరు అమ్మాయి గురించే నెటిజన్లు ఎక్కువగా మాట్లాడుకున్నారు. ఐపీఎల్ మిస్టరీ గర్ల్‌గా సదరు అమ్మాయి చరిత్రలో నిలిచిపోయింది.
పంజాబ్ జట్టుకు మద్దతుగా టెన్షన్ పడిన అమ్మాయి రియానా లల్వానీగా అప్పట్లో నెటిజన్లు గుర్తించారు. గోళ్లు కొరుకుతూ.. ఆమె ఇచ్చిన ఒక్క ఎక్స్‌ప్రెషన్‌కు నెటిజన్లు పిచ్చెక్కిపోయారు. ఈ ఒక్క సీన్‌తో ఆమె పాపులర్ వ్యక్తిగా నిలవగా.. సోషల్ మీడియా వేదికగా ఫాలోవర్లు అమాంతం పెరిగిపోయారు. ఆ సీజన్‌లో పంజాబ్ ఆట కంటే రియానాను చూసేందుకే నెటిజన్లు ఆసక్తి చూపించారు.

