ఐపీఎల్ 2025 సీజన్‌లో వరుస విజయాలతో జోరు మీదున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. ఆదివారం ఢిల్లీ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌లో ఆర్‌సీబీ అమీతుమీ తేల్చుకోనుంది. బెంగళూరు వేదికగా ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయాన్ని సొంతం చేసుకుంది.
ఆ మ్యాచ్‌లో బెంగళూరు లోకల్ భాయ్ కేఎల్ రాహుల్ తన క్లాస్ బ్యాటింగ్‌తో ఆర్‌సీబీని ఓడించాడు. ఒంటిచేత్తో ఢిల్లీని గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో విన్నింగ్ షాట్ కొట్టిన తర్వాత కేఎల్ రాహుల్ ఆగ్రహంగా సంబరాలు చేసుకున్నాడు. కాంతార సినిమా సీన్‌ను రీక్రియేట్ చేశాడు. బ్యాట్‌తో ఓ సర్కిల్‌ను గీసి.. 'ఈ గ్రౌండ్ నాది.. ఇది నా అడ్డా'అంటూ సెలెబ్రేట్ చేసుకున్నాడు.

కోహ్లీ రెచ్చగొట్టడంతోనే..
ఈ సెలెబ్రేషన్స్ తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఱవిరాట్ కోహ్లీ, ఆర్‌సీబీ టీమ్‌పై కోపంతోనే రాహుల్ ఇలా ఆగ్రహంగా సంబరాలు చేసుకున్నాడని ఆ సమయంలో ఫ్యాన్స్ కామెంట్ చేశారు. ఆ సమయంలోనే కొందరు ఆర్‌సీబీ అభిమానులు రాహుల్‌ను హెచ్చరించారు. తన అడ్డాలో ఈ సంబరాలకు సరైన కౌంటరిస్తారని చెప్పారు.
ఆ సమయం ఆసన్నమవ్వడంతో ఫ్యాన్స్ కేఎల్ రాహుల్‌తో పాటు ఢిల్లీ క్యాపిటల్స్‌ను హెచ్చరిస్తున్నారు. రాహుల్ తరహాలోనే కోహ్లీ చెలరేగి రివేంజ్ తీర్చుకుంటాడని జోస్యం చెబుతున్నారు. కోహ్లీకి తిరిగి ఇచ్చేయడం సరదా? అని అందరి సరదా తీర్చేస్తాడని కామెంట్ చేస్తున్నారు.
అయ్యర్ లెక్క సరి..
ఇప్పటికే పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ లెక్క సరిచేశాడని, చిన్నస్వామి స్టేడియంలో గెలిచిన తర్వాత అయ్యర్ ఇలానే కోహ్లీ ముందు అత్యుత్సాహం ప్రదర్శించాడని ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు. పంజాబ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ గెలిపించి అయ్యర్ ముందే సంబరాలు చేసుకున్నాడని కామెంట్ చేస్తున్నారు. సేమ్ సీన్ ఢిల్లీలో కూడా రిపీట్ అవుతుందని పేర్కొంటున్నారు.
ఇప్పటికే ఈ రివేంజ్ ఫైట్ కోసం ఆర్‌సీబీ టీమ్ ఢిల్లీకి చేరుకుంది. ఢిల్లీ విమానాశ్రయంలో లోకల్ భాయ్ విరాట్ కోహ్లీకి ఘన స్వాగతం లభించింది. కోహ్లీ కోసం భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు.