టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, సౌతిండియా స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న వివాహం చేసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట వైరల్‌గా మారాయి. రష్మిక, హార్దిక్ పాండ్యా పూల దండలు ధరించి ఉన్న ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ద్వారా రూపొందించిన ఫొటోలుగా తెలుస్తోంది. వాటిని చూస్తేనే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది.
మైదానంలో రష్మిక-హార్దిక్ పాండ్యా పూల దండలు ధరించి ఉన్న ఈ ఫొటో చూడగానే ఈ విషయం స్పష్టమవుతోంది. అయితే ఈ విషయం తెలియని కొందరు నెటిజన్లు తమ అమాయకత్వంతో చిక్కుల్లో పడుతున్నారు. మరికొందరు ఆకతాయి బుద్దితో కావాలనే ఈ ఫేక్ ఫొటోలను వైరల్ చేస్తూ శునకానందం పొందుతున్నారు.

అమాయకత్వమా..ఆకతాయితనమా..?
hamid786.2011 అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ హార్దిక్-రష్మిక ఏఐ ఫొటోను షేర్ చేశాడు. హార్దిక్ పాండ్యా, రష్మిక మందన్న వివాహం చేసుకున్నారని.. వారికి విషెస్ తెలియజేసారా?అని క్యాప్షన్ ఇచ్చాడు. ఇది ఫేక్ ఫొటో అని తెలియక చేశాడో లేక ఆకతాయితనంతో షేర్ చేశాడో తెలియదు కానీ.. క్షణాల్లో ఈ పిక్ వైరల్ అయ్యింది. ఫ్యాక్ట్ చెక్ టూల్స్‌తో ఈ ఫొటోను పరిశీలించగా.. ఫేక్ అని తేలింది. ఏఐ జనరేటెడ్ ఫొటోగా స్పష్టమైంది. హార్దిక్ పాండ్యా-రష్మిక దుబాయ్‌లో డేటింగ్ చేస్తున్నట్లు కూడా ఫొటోలు రూపొందించి వైరల్ చేశారు.
బ్రిటీష్ సింగర్‌తో డేటింగ్..
ప్రస్తుతం హార్దిక్ పాండ్యా ఐపీఎల్ 2025 సీజన్ ఆడుతుండగా.. రష్మిక తన సినిమాలతో బిజీగా ఉంది. నటాషా స్టాంకోవిచ్‌తో విడాకుల అనంతరం హార్దిక్ పాండ్యా ఒంటరిగానే ఉంటున్నాడు. అతను బ్రిటీష్ సింగర్ జాస్మిన్ వాలియాతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పలు మ్యాచ్‌లకు ఈ బ్రిటీష్ సింగర్ హాజరవ్వడం.. ఈ ఇద్దరు కలిసి ఉన్న ఫొటోలు నెట్టింట వైరల్ కావడంతో ఈ వార్తలకు బలం చేకూర్చింది.

అయితే ఈ ఇద్దరూ తమ డేటింగ్ గురించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరోవైపు రష్మిక మందన్న.. టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండతో పీకల్లోతూ ప్రేమలో ఉన్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. వీరి బంధంపై కూడా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
సెలెబ్రిటీలకు శాపంగా ఏఐ..
ఏఐ టెక్నాలజీ సెలెబ్రిటీలకు శాపంగా మారింది. మంచికి వాడాల్సిన సాంకేతికను కొందరు ఆకతాయిలు తప్పుడు పనులకు ఉపయోగిస్తున్నారు. ఏఐ సాయంతో నకిలీ ఫొటోలు, వీడియోలను సృష్టించి పలువురు ప్రముఖుల పరువును బజారున పడేస్తున్నారు. ఐపీఎల్ 2025 సీజన్ నేపథ్యంలో ఈ జాడ్యం మరీ ఎక్కువైంది. టీమ్ ఓనర్స్‌కు ఆటగాళ్లతో ఎఫైర్స్ పెడుతూ.. ఏఐ సాయంతో ఫేక్ వీడియోలను సృష్టించి వైరల్ చేస్తున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్‌పై కూడా ఈ నకిలీ వీడియోలను సృష్టించి ట్రెండ్ చేశారు. పంజాబ్ కింగ్స్ కో ఓనర్ ప్రీతి జింటా.. తమ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు లిప్ లాక్ ఇచ్చినట్లు ఓ నకిలీ వీడియోను సృష్టించి వైరల్ చేశారు.