రాజస్థాన్ రాయల్స్ యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్‌పై ఆ జట్టు అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జురెల్ అత్యుత్సాహంతో జట్టు ఓటమికి కారణమయ్యాడని ఆరోపిస్తున్నారు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓటమిపాలైంది. సూపర్ ఓవర్‌కు దారి తీసిన ఈ మ్యాచ్‌ను రాజస్థాన్ రాయల్స్ చేజేతులా చేజార్చుకుంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 188 పరుగులు చేసింది. అనంతరం రాజస్థాన్ రాయల్స్ కూడా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 188 పరుగులే చేయడంతో సూపర్ ఓవర్ ఆడించాల్సి వచ్చింది. సూపర్ ఓవర్‌లో రాజస్థాన్ రాయల్స్ 11 పరుగులే చేసి ఆలౌటవ్వగా(రెండు వికెట్లు కోల్పోయి).. ఢిల్లీ క్యాపిటల్స్ మరో రెండు బంతులు మిగిలి ఉండగానే 13 పరుగులు చేసి గెలుపొందింది.

ఈజీగా గెలిచే మ్యాచ్..
అయితే 189 పరుగుల లక్ష్యచేధనలో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. యశస్వి జైస్వాల్(37 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 51), నితీష్ రాణా(28 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 51) హాఫ్ సెంచరీలతో రాణించగా.. సంజూ శాంసన్(19 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 31) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రాజస్థాన్ విజయానికి చివరి 24 బంతుల్లో 31 పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో సెట్ అయిన నితీష్ రాణాతో పాటు ధ్రువ్ జురెల్ ఉండటంతో రాజస్థాన్ విజయం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ 18వ ఓవర్ వేసిన స్టార్క్.. రాణాను ఔట్ చేసి మ్యాచ్‌ను ఉత్కంఠగా మార్చాడు. మోహిత్ శర్మ వేసిన 19వ ఓవర్‌లో ధ్రువ్ జురెల్ సిక్స్ బాదడంతో 14 పరుగులు వచ్చాయి.
ఆ పరుగు తీసుంటే..
ఆఖరి ఓవర్‌లో రాజస్థాన్ విజయానికి 9 పరుగులు అవసరమవ్వగా.. స్టార్క్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. ఐదో బంతిని షిమ్రాన్ హెట్‌మైర్ లాంగాన్ దిశగా ఆడి క్విక్ డబుల్‌కు ప్రయత్నించగా.. ధ్రువ్ జురెల్ నిరాకరించాడు. దాంతో ఈజీగా డబుల్ వచ్చే చోట సింగిల్ వచ్చింది. చివరి బంతికి రాజస్థాన్ విజయానికి 2 పరుగులు అవసరవ్వగా.. డీప్ మిడ్ వికెట్ దిశగా ఆడిన మిచెల్ స్టార్క్ క్విక్ డబుల్‌కు ప్రయత్నించి రనౌటయ్యాడు.
మ్యాచ్‌ను తానే ఫినిష్ చేయాలనే అత్యుత్సాహంతో ధ్రువ్ జురెల్ క్విక్ డబుల్ తీయకుండా జట్టు ఓటమికి కారణమయ్యాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఆ పరుగు తీసుంటే.. స్ట్రైక్‌లో హెట్‌మైర్ ఉండేవాడని అతను ఆఖరి బంతికి సునాయసంగా సింగిల్ తీసేవాడని అభిప్రాయపడుతున్నారు. జోస్ బట్లర్‌ను కాదని ధ్రువ్ జురెల్‌ను రిటైన్ చేసుకున్నందుకు తగిన శాస్త్రి చేశాడని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.