ఐపీఎల్ 2025 మెగా వేలం నేపథ్యంలో టీమిండియా స్టార్ వికెట్ కీపర్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ ఆ జట్టును వీడుతున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎక్స్ వేదికగా అతను చేసిన ట్వీట్ ఈ చర్చకు దారి తీసింది. 'ఒకవేళ నేను ఐపీఎల్ వేలంలోకి వస్తే ఎవరైనా కొనుగోలు చేస్తారా? లేదా? ఎంత ధర పలుకుతాను?'అని ప్రశ్నించాడు.
దాంతో రిషభ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ వీడుతారా? అనే చర్చ మొదలైంది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్.. రిషభ్ పంత్‌ను తీసుకునేందుకు సిద్దమైనట్లు వార్తలు వచ్చాయి. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్‌మెంట్ మాత్రం రిషభ్ పంత్‌ను రిటైన్ చేసుకుంటామని స్పష్టం చేసింది. రిషభ్ పంత్ సరదాగా ఈ ట్వీట్ చేసి ఉంటాడని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీని బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని, వారి నుంచి ఏదో ఆశిస్తున్నాడని అభిప్రాయపడుతున్నారు.

కొందరైతే తాగి ఇలా ట్వీట్లు చేయడం.. కారు నడపడం మానేయాలని సెటైర్లు పేల్చుతున్నారు. అర్థరాత్రి దాకా తాగితే ఇలాంటి ఆలోచనలే వస్తాయని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. 20 కోట్లకు పైనే పలుకుతావని, అమ్ముడుపోవని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇప్పటికే ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించిన రిటెన్షన్ రూల్స్‌ను బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే.
మొత్తం ఆరుగురి ఆటగాళ్లను రిటైన్ చేసుకునే అవకాశం కల్పించింది. నేరుగానైనా.. ఆర్‌టీఎమ్ ద్వారానైనా ఆరుగురి ఆటగాళ్లను రిటైన్ చేసుకోవచ్చు. జట్ల పర్స్ వాల్యూను రూ. 120 కోట్లకు పెంచింది. గరిష్టంగా ఐదుగురు క్యాప్‌డ్, ఇద్దరు అనామక ఆటగాళ్లను రిటైన్ చేసుకోవచ్చని పేర్కొంది. రిటైన్ చేసుకునే ముగ్గురి ఆటగాళ్లకు వరుసగా రూ. 18 కోట్లు, రూ. 14 కోట్లు, రూ. 11 కోట్లు చెల్లించాలి. నాలుగో, ఐదో ఆటగాడిని రిటైన్ చేసుకోవాలనుకుంటే రూ. 18 కోట్లు, రూ. 14 కోట్లు చెల్లించాలి. అనామక ఆటగాళ్లకు రూ. 4 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది.
If go to the auction. will I be sold or not and for how much ??
— Rishabh Pant (@RishabhPant17) October 11, 2024
అక్టోబర్ 31లోపు రిటెన్షన్ జాబితాను ప్రకటించాలని ఫ్రాంచైజీలను ఆదేశించింది. ఈ ఏడాది డిసెంబర్‌లో మెగా వేలం జరగనుంది. ఈ సారి విదేశాల్లో మెగా వేలం నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది.