ఐపీఎల్ 2025 మెగా వేలం కోసం చెన్నై సూపర్ కింగ్స్ అన్ని విధాల సిద్దమవుతోంది. వేలంలో అనుసరించాల్సిన వ్యూహాలను సిద్దం చేసుకుంటోంది. ఇప్పటికే జట్టుకు కావాల్సిన ఆటగాళ్ల జాబితాను సిద్దం చేసుకున్న సీఎస్‌కే.. వేలంలో ఎవరెవరిని? టార్గెట్ చేయాలి? వారి బ్యాకప్ ప్లేయర్లు ఎవరా? అనే అంశంపై తీవ్రంగా కసరత్తు చేస్తోంది.
దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని అనామక ప్లేయర్‌గా రూ. 4 కోట్లకే సీఎస్‌కే రిటైన్ చేసుకుంది. కానీ అతను ఫుల్ టైమ్ వికెట్ కీపర్‌గా రాణించగలడా? అనేదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

వికెట్ కీపర్ కోసం..
మోకాలి నొప్పితో పాటు ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్న ధోనీ.. బ్యాటింగ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా మాత్రమే కొనసాగుతాడని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ధోనీ పూర్తి స్థాయి కీపర్‌గా రాణించినా.. తదుపరి సీజన్ ఆడటం సందేహంగా మారింది. ఈ క్రమంలోనే సీఎస్‌కేకు ఓ ప్రొఫెషనల్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ అవసరం ఏర్పడింది.
వేలంలో స్పెషలిస్ట్ వికెట్ కీపర్‌ను కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ రిషభ్ పంత్‌ను టార్గెట్ చేసిందనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. కానీ రిషభ్ పంత్ సీఎస్‌కేకు దక్కపోవచ్చు.
పంత్‌ను కొనలేరు..
ప్రస్తుత పరిస్థితుల్లో పంత్ రూ. 25 కోట్ల నుంచి 30 కోట్లకు పైగానే పలికే ఛాన్స్ ఉంది. కానీ అంత డబ్బు చెల్లించే పరిస్థితి చెన్నై సూపర్ కింగ్స్‌కు లేదు. ప్రస్తుతం ఆ జట్టు పర్స్ మనీలో రూ. 55 కోట్లు మాత్రమే ఉన్నాయి. ధోనీతో సహా ఐదుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకున్న సీఎస్‌కే రూ. 65 కోట్లు ఖర్చు చేసింది.
రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజాలను రూ. 18 కోట్లకు రిటైన్ చేసుకున్న సీఎస్‌కే.. మతీష పతీరణ రూ. 13 కోట్లు, శివమ్ దూబేను రూ. 12 కోట్లకు అట్టిపెట్టుకుంది. ఐపీఎల్ 2025 మెగా వేలం కోసం ప్రతీ జట్టు పర్స్ వాల్యూను రూ. 120 కోట్లకు పెంచిన విషయం తెలిసిందే. సీఎస్‌కే దగ్గర ఉన్న రూ. 55 కోట్లలో పంత్ కోసం రూ. 25 నుంచి 30 కోట్లు ఖర్చు పెట్టలేదు.
పంజాబ్‌కే పంత్
అత్యధిక పర్స్ వాల్యూ రూ. 110 కోట్లు కలిగిన పంజాబ్ కింగ్స్ రిషభ్ పంత్‌ను కొనుగోలు చేసే అవకాశం ఉంది. మరో వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కోసం కూడా ఫ్రాంచైజీలు ఎగబడనున్నాయి. అతన్ని ఆర్‌సీబీ కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

దాంతో సీఎస్‌కే ముందు ఉన్న ఆప్షన్స్ ఇషాన్ కిషన్, జితేష్ శర్మ మాత్రమే. ఇషాన్ కిషన్ కూడా భారీ ధర పలక వచ్చు. రూ. 15 కోట్ల లోపు లభిస్తే అతన్ని సీఎస్‌కే కొనుగోలు చేసే అవకాశం ఉంది. లేదంటే చెన్నైకి జితేష్ శర్మ దిక్కవుతాడు. అతను రూ. 5 నుంచి 10 కోట్ల లోపు దక్కవచ్చు. అతన్ని కూడా కొనుగోలు చేయకపోతే.. సీఎస్‌కే అనామక వికెట్ కీపర్లను తీసుకోవాల్సి ఉంటుంది.