ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందే ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఇంకా గాయం నుంచి కోలుకోలేదని తెలుస్తోంది. ప్రస్తుతం బుమ్రా వెన్ను గాయంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆఖరి మ్యాచ్‌లో బుమ్రాకు వెన్ను గాయం తిరగబెట్టింది. దాంతో అతను రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయలేదు. అప్పటి నుంచి భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. ఈ గాయం కారణంగానే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి కూడా దూరమయ్యాడు.
అయితే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు బుమ్రా గాయం నుంచి కోలుకున్నాడని, కానీ మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించలేదని బీసీసీఐ ప్రకటించింది. దాంతో ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైనా ఐపీఎల్ 2025తో బుమ్రా రీ ఎంట్రీ ఇస్తాడని అందరూ భావించారు. కానీ బుమ్రా ఫిట్‌నెస్‌పై బీసీసీఐ మెడికల్ టీమ్ ఇంకా క్లియరెన్స్ ఇవ్వలేదని తెలుస్తోంది. ఐపీఎల్ 2025 అనంతరం టీమిండియా ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ సిరీస్ కోసమే బుమ్రా గాయం విషయంలో బీసీసీఐ వేచి చూస్తుందని ఓ ప్రముఖ క్రీడా ఛానెల్ పేర్కొంది. గాయం నుంచి పూర్తిగా కోలుకొని మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించిన తర్వాతే అతనికి క్లియరెన్స్ ఇవ్వాలని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నారట.

ఈ లెక్కన బుమ్రా.. ఏప్పిల్‌లో ముంబై ఇండియన్స్ జట్టుతో కలిసే అవకాశం ఉంది. అయితే బుమ్రా ఎన్ని మ్యాచ్‌లకు దూరమవుతాడనే విషయంపై క్లారిటీ లేదు. కానీ అతను ఆరంభ మ్యాచ్‌లు ఆడే అవకాశం లేదు. ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్‌ను మార్చి 23న చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడనుంది. మార్చి 29న అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో రెండో మ్యాచ్‌లో తలపడనుంది. హోమ్ గ్రౌండ్ వాంఖడే స్టేడియం వేదికగా కేకేఆర్‌తో మార్చి 31న ముంబై తొలి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత లక్నో సూపర్ జెయింట్స్‌తో ఏప్రిల్ 4న, ఆర్‌సీబీతో ఏప్రిల్ 7న వాంఖడే వేదికగానే తలపడనుంది.
ఒకవేళ బుమ్రా ఏప్రిల్‌లో జట్టులోకి అందుబాటులోకి వస్తే ఆర్‌సీబీతో జరిగే మ్యాచ్‌లో ఆడే అవకాశం ఉంది. బుమ్రా గైర్హాజరీ ముంబై ఇండియన్స్ బౌలింగ్‌పై తీవ్ర ప్రభావం చూపనుంది. ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, రీస్ టోప్లీ, కోర్బిన్ బోచ్, అర్జున్ టెండూల్కర్, సత్యనారాయణ రాజు, అశ్విని కుమార్, హార్దిక్ పాండ్యా, రాజ్ అంగ్ బావాలతో పేస్ విభాగం పటిష్టంగా ఉన్నప్పటికీ.. బుమ్రా లోటును పూడ్చే సామర్థ్యం ఇందులో ఒక్కరికి కూడా లేదు.