టీమిండియా దిగ్గజ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ అప్‌కమింగ్ ఐపీఎల్ సీజన్ ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. ఐపీఎల్ 2025 సీజన్ ఆడే విషయంపై ధోనీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) వర్గాలు పేర్కొన్నాయి. జట్టులో కొనసాగే విషయంపై ధోనీని సంప్రదించినా.. అతను అందుబాటులోకి రాలేదని సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథ్ తెలిపారు.
ధోనీని కలిసి అతని అభిప్రాయం తెలుసుకున్న తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని కాశీ విశ్వనాథ్ చెప్పారు. ధోనీ కోసమే చెన్నై సూపర్ కింగ్స్ బీసీసీఐపై ఒత్తిడి చేసింది. పక్కకు పెట్టిన ఓ పాత ఐపీఎల్ నిబంధనను మళ్లీ అమలు చేసేలా చేసింది. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు భారత దేశవాళీ క్రికెట్‌కు దూరమై ఐదు సంవత్సాలు పూర్తయిన ఆటగాళ్లను అనామక ఆటగాళ్లుగా పరిగణించే పాత రూల్‌ను సీఎస్‌కే ఒత్తిడి మేరకు బీసీసీఐ మళ్లీ ప్రవేశపెట్టింది.

దాంతో చెన్నై సూపర్ కింగ్స్‌కు ధోనీని అనామక ఆటగాడిగా రూ. 4 కోట్లు చెల్లించి రిటైన్ చేసుకునే వెసులుబాటు కలిగింది. ధోనీ కోసమే ఈ రూల్‌ను మళ్లీ ప్రవేశపెట్టినట్లు కూడా జోరుగా ప్రచారం జరిగింది. దాంతో ఐపీఎల్ 2025 సీజన్ ధోనీ ఆడటం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ కాశీ విశ్వనాథ్ వ్యాఖ్యలు ధోనీ అభిమానుల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి.
ప్రస్తుతం 43 ఏళ్ల వయసులో ఉన్న ధోనీ.. మోకాలి నొప్పితో బాధపడుతున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్ ముగిసిన వెంటనే ముంబైలో సర్జరీ కూడా చేసుకున్నాడు. కానీ అతను పూర్తి ఫిట్‌గా లేడనే వార్తలు వస్తున్నాయి. మునపటిలా వికెట్ కీపింగ్ చేయకపోవడంతో పాటు రన్నింగ్ చేయలేకపోతున్నాడని, వయసు రీత్యా వచ్చిన సమస్యలని ప్రచారం జరుగుతోంది.
ఐపీఎల్ వీడ్కోలుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, రిటెన్షన్ రూల్స్ వచ్చిన తర్వాతే ఆడేది? ఆడనది చెబుతానని ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ధోనీ చెప్పుకొచ్చాడు. బీసీసీఐ ఇప్పటికే రిటెన్షన్ రూల్స్ ప్రకటించడంతో పాటు ఐపీఎల్ 2025 మెగా వేలాన్ని నవంబర్ 30న నిర్వహించేందుకు సిద్దమవుతోంది. ఆరుగురి ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది.
టీమ్స్ పర్స్ వాల్యూను రూ. 120 కోట్లు పెంచిన బీసీసీఐ.. ఆరుగురి ఆటగాళ్లను రిటైన్ చేసుకోవాలంటే వరుసగా రూ. 18 కోట్లు, రూ. 14 కోట్లు, రూ. 11 కోట్లు, రూ. 18 కోట్లు, రూ. 14 కోట్లు, రూ. 4 కోట్లు చెల్లించాలని పేర్కొంది. గరిష్టంగా ఐదుగురు ఆటగాళ్లను, ఇద్దర్నీ అనామక ప్లేయర్లను తీసుకోవాలని పేర్కొంది. అక్టోబర్ 31లోపు రిటెన్షన్ జాబితాలను సమర్పించాలని ఫ్రాంచైజీలను ఆదేశించింది. అయితే ధోనీ నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో రిటెన్షన్ లిస్ట్‌పై సీఎస్‌కే మల్లగుల్లాలు పడుతోంది.