ఐపీఎల్ 2025 మెగా వేలం ముహుర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 24, 25 తేదీల్లో మెగా ఆక్షన్ నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే రిటెన్షన్ ప్రక్రియ ముగియగా.. పది ఫ్రాంచైజీలు తాము అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాలను ప్రకటించాయి. రిటెన్షన్ ప్రక్రియ ముగియడంతో మెగా వేలం నిర్వహణపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఫోకస్ పెట్టింది.
నవంబర్ 30న మెగా వేలం నిర్వహిస్తారని ప్రచారం జరిగినా.. అంతకుముందే పూర్తి చేయాలనే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. జై షా సెక్రటరీగా ఉండగానే మెగా వేలాన్ని పూర్తి చేయాలనే లక్ష్యంతో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం. ఐసీసీ ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన జై షా.. డిసెంబర్ తొలి వారం ఆ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.

సౌదీ అరేబియాలో వేలం..
ఆలోపే మెగా వేలాన్ని పూర్తి చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ మెగా వేలానికి సంబంధించి బీసీసీఐ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని రియాద్‌లో మెగా వేలాన్ని పూర్తి చేయాలని బీసీసీఐ నిర్ణయించినట్లు ఐపీఎల్ వర్గాలు పేర్కొన్నాయి.
మరోవైపు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నవంబర్ 22 నుంచి భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ టెస్ట్ మధ్యలోనే ఐపీఎల్ వేలం నిర్వహిస్తారని సమాచారం. ఐపీఎల్ బ్రాడ్ కాస్టర్స్ స్టార్ స్పోర్ట్స్, జియోసినిమాలు.. మెగావేలాన్ని ప్రత్యక్షంగా ప్రసారం చేయనున్నాయి. అయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి కూడా స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ అధికారిక బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరిస్తోంది.
పంత్‌పైనే అందరి చూపు..
మెగా ఆక్షన్, టెస్ట్ మ్యాచ్ టైమింగ్స్ క్లాష్ అయితే తమకు నష్టం వాటిల్లుతుందని స్టార్ స్పోర్ట్స్ వాదిస్తోందంట. అయితే టెస్ట్ మ్యాచ్ టైమింగ్స్ క్లాష్ కాకుండా మధ్యాహ్నం సమయంలో మెగా వేలాన్ని పూర్తి చేయాలని బీసీసీఐ భావిస్తోందంట. ఈ సారి ఐపీఎల్ మెగావేలంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అర్ష్‌దీప్ సింగ్, ఇషాన్ కిషన్, మహమ్మద్ సిరాజ్ వంటి స్టార్ ఆటగాళ్లు వేలంలోకి వచ్చారు. సూపర్ ఫామ్‌లో ఉన్న రిషభ్ పంత్ రికార్డ్ ధర పలుకుతాడనే అంచనాలు.. మెగా వేలంపై సర్వత్రా ఆసక్తి నెలకొల్పుతున్నాయి. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ కూడా భారీ ధర పలుకుతాడని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఫ్రీగా చూడాలంటే..
మెగా వేలాన్ని జియోసినిమాలో ఫ్రీగా చూడవచ్చు. స్టార్ స్పోర్ట్స్ ఛానెల్స్‌లో చూడాలంటే మాత్రం ఆ చానెల్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే.