ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్‌లా అవుదామనుకోలేదని, ఓ మంచి ఆటగాడిలా మాత్రమే నిలవాలనుకున్నానని లక్నో సూపర్ జెయింట్స్ స్టార్ పేసర్ ఆవేశ్ ఖాన్ తెలిపాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆవేశ్ ఖాన్(3/37) అద్భుత బౌలింగ్‌తో లక్నోకు విజయాన్నందించాడు. ఆఖరి ఓవర్‌లో 9 పరుగుల డిఫెండ్ చేసి మ్యాచ్ విన్నర్‌గా నిలిచాడు.
ఈ మ్యాచ్ అనంతరం తన ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేసిన ఆవేశ్ ఖాన్.. మిచెల్ స్టార్క్‌తో తాను అస్సలు పోల్చుకోలేదని తెలిపాడు. సూపర్ ఓవర్‌కు దారి తీసిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్ పేసర్ అయిన మిచెల్ స్టార్క్.. స్టన్నింగ్ డెలివరీతో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించాడు. తాజా మ్యాచ్‌లో ఆవేశ్ ఖాన్ కూడా అతనిలానే యార్కర్లు సంధించి మ్యాచ్ గెలిపించడంతో.. హోస్ట్ మిచెల్ స్టార్క్ ప్రస్తావన తీసుకొచ్చాడు.

'నేను మిచెల్ స్టార్క్ అవ్వాలని అనుకోలేదు. ఓ మంచి ఆవేశ్ ఖాన్‌లా మాత్రమే ఉండాలనుకున్నా. ప్రతీ బంతిని కట్టుదిట్టంగా వేయాలనుకున్నా. నా బలం యార్కర్లు. నేను బంతిని వేయడానికి అదనంగా సమయం తీసుకోవడం కలిసొచ్చింది. మెరుగైన బౌలింగ్ చేసేందుకు ఈ సమయం ఉపయోగపడింది. నేను స్కోర్ బోర్డ్ చూసి బౌలింగ్ చేయను. ఎలాంటి బంతి వేయాలనేదానిపై మాత్రమే ఫోకస్ పెడుతాను. 9 పరుగులు డిఫెండ్ చేయాల్సినప్పుడు.. తొలి మూడు బంతుల్లో బౌండరీ ఇవ్వకూడదని భావించా. అలా చేస్తే బ్యాటర్లపై ఒత్తిడి పెరుగుతుందని తెలుసు. అప్పుడు మ్యాచ్ గెలవచ్చని భావించా. నేను అన్నుకన్నట్లే జరిగింది.
చివరి రెండు బంతులకు 6 పరుగులు కావాల్సినప్పుడు..వచ్చిన క్యాచ్‌ను మిల్లర్ వదిలేసాడు. అయితే ఆ క్యాచ్ పడుతాడనుకున్నా. కానీ వదిలేయడంతో రెండు పరుగులు వచ్చాయి. చివరి బంతికి నాలుగు రన్స్ అవసరమైనప్పుడు.. బంతి ఔట్ సైడ్ లేదా ఇన్‌సైడ్ ఎడ్జ్ తీసుకొని బౌండరీ వెళ్తుందేమోననే సందేహాలు కలిగాయి. అందుకే స్టంప్స్ టార్గెట్‌గా యార్కర్ వేసా. జట్టును గెలిపించడం సంతోషంగా ఉంది. చివరి బంతి బలంగా తాకడంతో చేయి విరిగిందనుకున్నా. నొప్పితో సంబరాలు చేసుకోలేకపోయా. ప్రస్తుతం నా చేతి బాగానే ఉంది. తీవ్ర గాయం కాదు.'అని ఆవేశ్ ఖాన్ చెప్పుకొచ్చాడు.