ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2026 సీజన్‌కు సంబంధించిన మినీ వేలానికి ముహుర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. డిసెంబర్ 13-15 మధ్య వేలం నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. నవంబర్ 15వ తేదీలోపు 10 జట్లు తమ రిటెన్షన్ జాబితాను ప్రకటించాల్సి ఉంటుంది.
ఐపీఎల్ వేలం జరిగే వేదికతో పాటు తేదీలపై బీసీసీఐ కసరత్తు చేస్తున్నట్లు బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. గత రెండు సీజన్లకు సంబంధించిన వేలం విదేశాల్లో జరగ్గా.. ఈసారి స్వదేశంలో నిర్వహించాలనే యోచనలో బోర్డు ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2025 సీజన్ కోసం మెగా వేలం నిర్వహించగా.. జట్లన్నీ పూర్తిగా మారిపోయాయి. మినీవేలంలో భారీ మార్పులు ఉండకపోయినా.. అవసరం లేని ఆటగాళ్లను ఐపీఎల్ ఫ్రాంచైజీలు వదిలేసే అవకాశం ఉంది.

ముఖ్యంగా ఐపీఎల్ 2025 పాయింట్స్ టేబుల్‌లో చివరి రెండు స్థానాల్లో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఎక్కువ సంఖ్యలో తమ ఆటగాళ్లను వదిలేసే అవకాశం ఉంది. తీవ్రంగా నిరాశపర్చిన దీపక్ హుడా, విజయ్ శంకర్, రాహుల్ త్రిపాఠి, సామ్ కరణ్, డెవాన్ కాన్వేలను సీఎస్‌కే వదులుకోనుంది. ఇప్పటికే అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆ జట్టు పర్స్‌లో రూ. 9.75 కోట్లు చేరాయి. రాజస్థాన్ రాయల్స్ తమ కెప్టెన్ సంజూ శాంసన్‌తో పాటు వానిందు హసరంగా, మహీష్ తీక్షణలను వదులుకునే ఛాన్స్ ఉంది. కేకేఆర్ రూ.23.75 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన వెంకటేశ్ అయ్యర్‌కు గుడ్‌బై చెప్పే ఛాన్స్ ఉంది.
ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఆ జట్టు తొలి టైటిల్‌ను అందుకుంది. కానీ ఆ సంబరం కాస్త 24 గంటల వ్యవధిలోనే విషాదంగా మారింది. ఆర్‌సీబీ విజయోత్సవ వేడుకల్లో తొక్కిసలాట చోటు చేసుకొని 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
ఈ ఘటనపై సీరియస్ అయిన కర్ణాటక ప్రభుత్వం కర్ణాటక అసోసియేషన్ ప్రతినిధులతో పాటు ఆర్‌సీబీ మేనేజర్, ఈవెంట్ మేనేజర్స్‌పై కేసులు నమోదు చేసింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగే మ్యాచ్‌లపై కూడా ఆంక్షలు విధించింది. మహిళల వన్డే ప్రపంచకప్ ఆతిథ్య హక్కులను చిన్నస్వామి స్టేడియం కోల్పోయింది. మరోవైపు బీసీసీఐ కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. విజయోత్సవ వేడుకల విషయంలో పలు మార్గదర్శకాలను జారీ చేసింది. విజయానంతరమే వేడుకల నిర్వహించవద్దని, కాస్త సమయం తీసుకోవాలని, సంబంధిత పోలీసు అధికారుల అనుమతి తప్పనిసరని పేర్కొంది.