భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా ధర్మశాల వేదికగా జరగాల్సిన పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ రద్దయిన విషయం తెలిసిందే. భారత సరిహద్దు నగరాలపై పాకిస్థాన్ మిస్సైల్స్‌తో దాడి చేయడంతో మైదానంలో ఫ్లడ్ లైట్స్ ఆపేసి మ్యాచ్‌ను నిలిపేసారు. ఆటగాళ్లను అక్కడి నుంచి హుటాహుటిన తరలించారు. ధర్మశాల ఎయిర్‌పోర్ట్ మూసి వేయడంతో ప్రత్యేకమైన వందేభారత్ ట్రైన్‌లో ఢిల్లీకి తరలించారు.
అయితే ఆ సమయంలో తీవ్ర భయాందోళనకు గురయ్యామని ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్, మిచెల్ స్టార్క్ సతీమణి అలీస్సా హీలీ తెలిపింది. ఆ రోజు తమకు ఎదురైన అనుభవాలను ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పంచుకుంది. 'మ్యాచ్ మధ్యలో ఫ్లడ్ లైట్స్ ఆపేసారు. ఆ తర్వాత ఓ వ్యక్తి వచ్చి వెంటనే ఇక్కడి నుంచి వెళ్లాలని చెప్పాడు. అతని ముఖం తెల్లగా అయిపోయింది. అసలేం జరగుతుందో మాకు అర్థం కాలేదు.

ఆ తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు, వారి కుటుంబాలు, సహాయక సిబ్బందిని స్టేడియంలోని ఓ హోల్డింగ్ రూమ్‌లోకి తరలించారు. ఫాఫ్ డుప్లెసిస్ అయితే షూస్ కూడా వేసుకోలేదు. మరో వ్యక్తి తమ రూమ్‌లోని ఓ చిన్నారిని ఎత్తుకొని ఇక్కడి నుంచి వేగంగా వెళ్లిపోవాలని చెప్పాడు. నేను వెంటనే మిచెల్ స్టార్క్‌ను ఏం జరగుతుందని అడిగాను. స్టేడియానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణంపై మిస్సైల్ దాడి జరిగిందని చెప్పాడు. దాంతోనే విద్యుత్ సరాఫరాను ఆపేసారని తెలిపాడు.
మా అందరిని అక్కడి నుంచి వ్యాన్‌ల్లో హోటల్‌కు తరలించారు. ఆ తర్వాత వందేభారత్ ట్రైన్ కోసం పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాల వైపు వెళ్లాల్సి వచ్చింది. దారిలో మాకు క్షిపణి స్థావరాలు కనిపించాయి. హోటల్‌లో భోజనం చేస్తున్న సమయంలో బాణా సంచా పేలుడు శబ్దం వినిపించడంతో ఉలిక్కి పడ్డాం. ఆ దేవుడి దయ వల్ల అందరం క్షేమంగా బయటపడ్డాం.'అని చెప్పుకొచ్చాడు.