సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ మేనేజ్‌మెంట్, కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అండతోనే తాను సెంచరీ సాధించగలిగానని ఆ జట్టు స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ తెలిపాడు. తన తల్లిదండ్రుల సమక్షంలో సెంచరీ చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో శనివారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. వరుసగా 4 పరాజయాల తర్వాత రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అభిషేక్ శర్మ(55 బంతుల్లో 14 ఫోర్లు, 10 సిక్స్‌లతో 141) విధ్వంసకర శతకంతో సన్‌రైజర్స్ విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
ఈ మ్యాచ్ అనంతరం తన సెంచరీ గురించి మాట్లాడిన అభిషేక్ శర్మ.. సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ మేనేజ్‌మెంట్, కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌తో పాటు టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్, టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌లకు అభిషేక్ శర్మ కృతజ్ఙతలు తెలిపాడు. వారి సహకారంతోనే సెంచరీ సాధించానని చెప్పాడు.

'ప్యాట్ కమిన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్‌కు కృతజ్ఞతలు. బ్యాటర్లు రాణించకపోయినా.. జట్టు వాతావరణాన్ని గొప్పగా ఉంచారు. ట్రావిస్ హెడ్‌తో పాటు నాకు ఈ రోజు ప్రత్యేకమైనది. ఈ రోజు నేను వికెట్‌కు తగ్గట్లుగానే బ్యాటింగ్ చేశాను. ఈ వికెట్‌పై ఈజీగా ఆడగలిగే కొత్త షాట్స్‌ను కనుగోవాలనుకున్నాను. వికెట్ బ్యాటింగ్‌కు బాగా అనుకూలంగా ఉంది. నా తల్లిదండ్రుల సమక్షంలో సెంచరీ చేయడం సంతోషంగా ఉంది. వారి కోసం నేను చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాను. నేను కాదు.. మా తల్లిదండ్రుల కోసం సన్‌రైజర్స్ టీమ్ మొత్తం ఎదురు చూసింది.
ఒక విధంగా వారి రాకతో సన్‌రైజర్స్‌కు లక్ కలిసొచ్చింది. బ్యాటింగ్ సందర్బంగా ట్రావిస్ హెడ్, నేను ఏం మాట్లాడుకోలేదు. ఇది మా సహజమైన ఆట. తొలి వికెట్ భాగస్వామ్యం నా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. ఈ సెంచరీ నాకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే నేను మా పరాజయాల పరంపరకు బ్రేక్ వేయాలనుకున్నాను. వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిపోవడం చాలా కష్టంగా అనిపించింది. కానీ ఏ రోజు కూడా పరాజయాల గురించి జట్టులో మాట్లాడుకోలేదు. నా మెంటార్ యువీ పాజీ, సూర్యకుమార్ యాదవ్‌లకు ధన్యవాదాలు. ఈ ఇద్దరూ నాతో టచ్‌లో ఉన్నారు. అతి త్వరలోనే భారీ ఇన్నింగ్స్ ఆడువని సూర్యకుమార్ యాదవ్ నాకు మెసేజ్ చేశాడు'అని అభిషేక్ శర్మ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 245 పరుగుల భారీ స్కోర్ చేసింది. శ్రేయస్ అయ్యర్(36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 82) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగాడు. అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ 18.3 ఓవర్లలో 2 వికెట్లకు 247 పరుగులు చేసి గెలుపొందింది. అభిషేక్ శర్మతో పాటు ట్రావిస్ హెడ్(37 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 66) హాఫ్ సెంచరీతో రాణించాడు.