ఐపీఎల్ 2025 సీజన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ విజయంతో ముగించింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 110 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. తమకే సాధ్యమైన విధ్వంసకర బ్యాటింగ్‌తో ఫిరోజ్ షా కోట్లా మైదానాన్ని పరుగుల వరదతో ముంచెత్తింది. 278 పరుగులు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. కేకేఆర్‌ను 168 పరుగులకే పరిమితం చేసింది. వై నాట్ 300 అంటూ ఈ సీజన్‌ను ప్రారంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ అందుకు తగ్గట్లుగానే తొలి మ్యాచ్‌లోనే 286 పరుగులు చేసింది. ఆ తర్వాత దారుణంగా విఫలమై ప్లే ఆఫ్స్ రేసు తప్పుకుంది. కానీ ఆఖర్లో పుంజుకొని హ్యాట్రిక్ విజయంతో ఈ సీజన్‌ను ముగించింది.
భారీ అంచనాలతో బరిలోకి దిగిన మహమ్మద్ షమీ, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్, ప్యాట్ కమిన్స్, జీషన్ అన్సారీ వైఫల్యం సన్‌రైజర్స్ హైదరాబాద్ కొంపముంచింది. ముఖ్యంగా షమీ, నితీష్ కుమార్ రెడ్డి దారుణంగా విఫలమయ్యారు. ఈ సీజన్ వైఫల్యం నేపథ్యంలో వచ్చే ఏడాదికి సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ తప్పిదాలను సరిదిద్దుకొని బలంగా తిరిగొచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా బలహీనంగా ఉన్న బౌలింగ్ విభాగాన్ని పటిష్టం చేసుకోనుంది. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు మహమ్మద్ షమీ, జీషన్ అన్సారీ, రాహుల్ చాహర్, అభినవ్ మనోహర్, ఆడమ్ జంపాలను విడుదల చేసే అవకాశం ఉంది.

1. మహమ్మద్ షమీ
ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలంలో మహమ్మద్ షమీని రూ. 10 కోట్ల భారీ ధరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. షమీ కోసం సుదీర్ఘ కాలంగా జట్టుకు ఆడిన భువనేశ్వర్ కుమార్‌ను వదిలేసింది. కానీ షమీ ఈ సీజన్‌లో తీవ్రంగా నిరాశపరిచాడు. 9 మ్యాచ్‌లు ఆడి 11.23 ఎకానమీతో 6 వికెట్లు మాత్రమే తీసాడు. వరుస అవకాశాలు ఇచ్చినా షమీ ప్రదర్శన మెరుగవ్వకపోవడంతో అతన్ని తుది జట్టు నుంచి తప్పించి బెంచ్‌కే పరిమితం చేశారు. షమీ లేని 5 మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ మూడు విజయాలు నమోదు చేసింది. పైగా షమీ వయసు కూడా పైబడటంతో అతన్ని వదిలేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
2. రాహుల్ చాహర్..
స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కొనుగోలు చేసిన రాహుల్ చాహర్ కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ కొంపముంచాడు. రూ. 3.20 కోట్లు పెట్టిన చాహర్‌ను కొనుగోలు చేయగా.. అతను ఫామ్‌లేమితో జట్టుకు నష్టం చేశాడు. ఒకే ఒక్క మ్యాచ్ ఆడి ఒక్క ఓవర్ మాత్రమే బౌలింగ్ చేశాడు. అతని వైఫల్యం సన్‌రైజర్స్ హైదరాబాద్ అవకాశాలను దెబ్బతీసింది. రాహుల్ చాహర్‌ను కూడా వదులుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు రాహుల్ చాహర్ దేశవాళీ ప్రదర్శనను బట్టి అతన్ని కొనసాగించాలా? వద్దా? అనే విషయంలో ఆరెంజ్ ఆర్మీ నిర్ణయం తీసుకోవచ్చు.
3.జీషన్ అన్సారీ..
స్పెషలిస్ట్ స్పిన్నర్ జీషన్ అన్సారీ తన తొలి మ్యాచ్‌లోనే మూడు వికెట్లు తీసి ఆశలు రేకెత్తించాడు. కానీ ఆ తర్వాత ఆ జోరును కొనసాగించలేకపోయాడు. 10 మ్యాచ్‌ల్లో 9.84 ఎకానమీతో 6 వికెట్లు మాత్రమే తీసాడు. అతని వైఫల్యం కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ కొంపముంచింది. అయితే రూ. 40 లక్షలకే జీషన్ అన్సారీ రావడంతో రిలీజ్ చేసే ముందు అతని ఫామ్‌ను పరిగణలోకి తీసుకునే ఛాన్స్ ఉంది.
4. ఆడమ్ జంపా
స్పెషలిస్ట్ స్పిన్నర్ కోటాలో కొనుగోలు చేసిన ఆడమ్ జంపా ఆరంభంలోనే గాయంతో ఈ సీజన్ మొత్తానికి దూరమవ్వడం సన్‌రైజర్స్ విజయవకాశాలపై ప్రభావం చూపింది. అతను ఈ సీజన్‌లో 2 మ్యాచ్‌లు మాత్రమే ఆడి 2 వికెట్లు పడగొట్టాడు. ఓవర్‌సీస్ ప్లేయర్ కావడంతో అతన్ని వదిలేసి సన్‌రైజర్స్ దేశవాళీ స్పిన్నర్‌ను తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
5.అభినవ్ మనోహర్
ఫినిషర్‌గా జట్టుకు ఉపయోగపడుతాడని భావించి రూ.3.20 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన అభినవ్ మనోహర్ కూడా దారుణంగా విఫలమయ్యాడు. ఆరంభంలో వరుస మ్యాచ్‌ల్లో అవకాశం కల్పించినా అతను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. 8 మ్యాచ్‌ల్లో 12.20 స్ట్రైక్‌రేట్‌తో 61 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే అతన్ని వదిలేసి మరో భారత బ్యాటర్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ తీసుకోవచ్చు.