ఐపీఎల్ 2024 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) టైటిల్ గెలవకుండా మరోసారి నిరాశపరిచినా.. అసాధారణ ప్రదర్శనతో ఆకట్టుకుంది. అభిమానులు తలెత్తుకునేలా సంచలన ప్రదర్శన చేసింది. ఫస్టాఫ్ సీజన్‌లో 8 మ్యాచ్‌లకు ఒకే ఒక్క విజయం సాధించిన ఆర్‌సీబీ.. సెకండాఫ్‌లో మాత్రం దుమ్మురేపింది.
అనూహ్యంగా పుంజుకొని వరుసగా 6 మ్యాచ్‌లు గెలిచి ప్లేఆఫ్స్ బెర్త్ దక్కించుకుంది. చివరి పోరులో భీకరమైన చెన్నై సూపర్ కింగ్స్‌ను భారీ తేడాతో ఓడించి మెరుగైన రన్‌రేట్‌తో ప్లే ఆఫ్స్ దూసుకెళ్లింది. ఈ విజయానంతరం ఆర్‌సీబీ అభిమానుల సంతోషానికి హద్దే లేకుండా పోయింది. టైటిల్ గెలిచిన రీతిలో సంబరాలు చేసుకున్నారు.

అయితే రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన కీలక ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఆ జోరు కొనసాగించలేకపోయింది. గ్లేన్ మ్యాక్స్‌వెల్, దినేశ్ కార్తీక్ వైఫల్యం ఆర్‌సీబీ కొంపముంచింది. దాంతో టోర్నీ నుంచి నిష్క్రమించి నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. ఈ సీజన్‌లో ఆర్‌సీబీ టైటిల్ గెలవలేకపోయినా.. తమ ఆటతీరుతో అభిమానులను సంతోషపరిచింది.
మెగా ఆక్షన్..
వచ్చే ఏడాది మెగా ఆక్షన్ జరగనున్న నేపథ్యంలో ఆర్‌సీబీ జట్టులో ఎవరు ఉంటారు? అనేది ఆ జట్టు అభిమానులకు ప్రశ్నగా మారింది. తాజా సీజన్‌లో ఆర్‌సీబీ పరాజయాలకు ప్రధాన కారణమైన గ్లేన్ మ్యాక్స్‌వెల్‌పై వేటు పడనుంది. అతనితో పాటు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌కు ఆర్‌సీబీ గుడ్‌బై చెప్పే అవకాశాలు ఉన్నాయి.
ఇప్పటి వరకు అయితే ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించిన రిటైన్ పాలసీని రూపొందించలేదు. గత మెగా వేలం రూల్స్ ప్రకారం ఒక జట్టు గరిష్టంగా నలుగురిని మాత్రమే రిటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ముగ్గురు భారత క్రికెటర్లు, ఒక విదేశీ క్రికెటర్ లేదా ఇద్దరు భారత క్రికెటర్లు, ఇద్దరు విదేశీ క్రికెటర్లు ఉండొచ్చు.
ఆర్‌టీఎమ్‌కు అవకాశం ఉంటే?
కొత్త టీమ్స్ ఎంట్రీతో ఐపీఎల్ 2022 మెగా వేలంలో RTM(రైట్ టు మ్యాచ్)కు అవకాశం లేదు. ఈ ఆర్‌టీఎమ్ ప్రకారం వేలంలో ఏదైనా టీమ్ తమ ఆటగాడిని కొనుగోలు చేస్తే.. ఆర్‌టీఎమ్ కింత సదరు ఆటగాడికి ఆ డబ్బు చెల్లించి తీసుకోవచ్చు. రిటైన్, ఆర్‌టీమ్ ప్రకారం గరిష్టంగా 5 గురు ఆటగాళ్లనే తీసుకోవాలి. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్‌లో ఆర్‌టీఎమ్‌కు అవకాశం ఇస్తారో లేదో చూడాలి.
ఆర్‌సీబీలో మిగిలేది ఆ నలుగురే..
ఆర్‌సీబీ విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, విల్ జాక్స్, మహమ్మద్ సిరాజ్‌లను రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. ఆర్‌టీఎమ్‌కు అవకాశం ఉంటే కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌ను తీసుకోవచ్చు. అప్పటి వరకు గ్లేన్ మ్యాక్స్‌వెల్ సూపర్ ఫామ్‌లోకి వస్తే అతన్ని కూడా తీసుకోవచ్చు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియానికి సూటయ్యే ఆటగాళ్లను తీసుకుంటామని ఆర్‌సీబీ కోచ్ ఇప్పటికే స్పష్టం చేశాడు.