ఐపీఎల్ 2024 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ దారుణంగా విఫలమైంది. 14 మ్యాచ్‌లకు ఐదు మాత్రమే గెలిచిన పంజాబ్ కింగ్స్.. పాయింట్స్ టేబుల్‌లో 9వ స్థానంలో నిలిచింది. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఆ జట్టు కేవలం రెండు సార్లు మాత్రమే ప్లే ఆఫ్స్ చేరింది. అందులో ఒకసారి ఫైనల్ చేరి తృటిలో టైటిల్ చేజార్చుకుంది.
జట్టులోని ప్రధాన ఆటగాళ్లు గాయపడటం.. అదృష్టం కలిసిరాక గెలవాల్సిన మ్యాచ్‌ల్లో ఓటమిపాలవ్వడం పంజాబ్ ప్లే ఆఫ్స్ అవకాశాలను దెబ్బతీసింది. కెప్టెన్ శిఖర్ ధావన్ గాయంతో సీజన్ మధ్యలోనే జట్టుకు దూరమవ్వడం.. జానీ బెయిర్ స్టో పేలవ ఫామ్, లియామ్ లివింగ్ స్టోన్ గాయంతో ఇబ్బంది పడటం పంజాబ్ కింగ్స్ కొంపముంచింది.

వచ్చే ఏడాది మెగా వేలం జరగనున్న నేపథ్యంలో పంజాబ్ కింగ్స్.. తమ జట్టును ప్రక్షాళన చేసే అవకాశం ఉంది. కెప్టెన్ శిఖర్ ధావన్‌తో పాటు స్టార్ ప్లేయర్లు అయిన జానీ బెయిర్ స్టోలకు గుడ్‌బై చెప్పే అవకాశం ఉంది.
నలుగురికే ఛాన్స్..
ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించిన రిటైన్ పాలసీ ఇంకా ఖరారు కాలేదు. కానీ 3+1 రిటెన్షన్‌కు అవకాశం ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఫ్రాంచైజీలు ముగ్గురిని నేరుగా రిటైన్ చేసుకోనుండగా.. మరొకరిని ఆర్‌టీఎమ్(రైట్ టు మ్యాచ్) కింద తీసుకోవచ్చు.
ఈ రూల్ ప్రకారం వేలంలో ఏదైనా జట్టు తమ ఆటగాడిని కొనుగోలు చేస్తే ఆర్‌టీఎమ్ కింద ఆ ధరను చెల్లించి రిటైన్ చేసుకోవచ్చు. రిటైన్ పాలసీ ప్రకారం ఒక జట్టు గరిష్టంగా నలుగురిని(3+1) మాత్రమే అంటిపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇందులో ముగ్గురు భారత క్రికెటర్లు, ఒక విదేశీ క్రికెటర్ లేదా ఇద్దరు భారత క్రికెటర్లు, ఇద్దరు విదేశీ క్రికెటర్లు మాత్రమే ఉండాలి.
మరోవైపు 8 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకునే అవకాశం ఇవ్వాలని ఫ్రాంచైజీలు బీసీసీఐని కోరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ డిమాండ్‌ను బీసీసీఐ అధికారులు తప్పుబట్టినట్లు తెలుస్తోంది. 8 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకున్న తర్వాత మెగా వేలం నిర్వహించడం ఎందుకు? అనే వాదన వ్యక్తమైనట్లు సమాచారం.
రిటైన్ చేసుకునేది ఆ నలుగురే..
ఐపీఎల్ రిటెన్షన్ పాలసీ ప్రకారం నలుగురికే అవకాశం ఉంటే పంజాబ్ కింగ్స్.. సామ్ కరణ్, అర్ష్‌దీప్ సింగ్, జితేశ్ శర్మ, శశాంక్ సింగ్‌లను తీసుకునే ఛాన్స్ ఉంది. కెప్టెన్ శిఖర్ ధావన్‌తో పాటు జానీ బెయిర్ స్టో, లియామ్ లివింగ్ స్టోన్ వంటి స్టార్ ఆటగాళ్లకు ఆ జట్టు గుడ్ బై చెప్పే అవకాశాలున్నాయి.
మెగా వేలం జరిగే సమయానికి బెయిర్ స్టో, లివింగ్ స్టోన్ సూపర్ ఫామ్‌లో ఉంటే మాత్రం వారి పేర్లను పరిశీలించవచ్చు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన శిఖర్ ధావన్‌కు పంజాబ్ కింగ్స్ మాత్రం ఉద్వాసన పలకనుంది. 38 ఏళ్ల వయసున్న శిఖర్ ధావన్‌ను తీసుకొని పంజాబ్ కింగ్స్ రిస్క్ చేయలేదు.
ఈ క్రమంలోనే ఆ జట్టు వేలంలో కొత్త కెప్టెన్‌ను ఎంచుకునే ఛాన్స్ ఉంది. వేలంలోకి రోహిత్ శర్మ అందుబాటులోకి వస్తే మాత్రం పంజాబ్ అతనిపై కోట్లు కుమ్మరించే అవకాశం ఉంది.