ఐపీఎల్ 2024 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ నిరాశపరిచింది. టోర్నీ ఆరంభంలో వరుస విజయాలతో సత్తా చాటిన ఆ జట్టు.. సెకండాఫ్‌లో వరుస పరాజయాలతో చతికిలపడింది. 14 మ్యాచ్‌లకు ఏడు మాత్రమే గెలిచి 7వ స్థానంతో సరిపెట్టుకుంది. ఐపీఎల్ 2022 సీజన్‌లో కొత్తగా లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జెయింట్స్.. వరుసగా రెండు సీజన్లలో మెరుగైన ప్రదర్శనతో ప్లే ఆఫ్స్ చేరింది.
కానీ ఈ సారి మాత్రం నాకౌట్ చేరకుండానే వెనుదిరిగింది. ఆ జట్టు యువ పేసర్, పేస్ సెన్సేషన్ మయాంక్ యాదవ్ గాయం లక్నో విజయవకాశాలను దెబ్బతీసింది. స్టార్ బౌలర్ ఆవేశ్ ఖాన్‌ను ఇచ్చి రాజస్థాన్ రాయల్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న దేవదత్ పడిక్కల్ దారుణంగా విఫలమయ్యాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ సైతం నిరాశపరిచాడు. దాంతో లక్నో ప్లే ఆఫ్స్ చేరకుండానే ఇంటిదారి పట్టాల్సి వచ్చింది.

ఈ సీజన్ వైఫల్యం నేపథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ తమ జట్టును ప్రక్షాళన చేయడంపై ఫోకస్ పెట్టింది. వచ్చే ఏడాది మెగా వేలం కూడా జరగనుండటంతో కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను కూడా వదులుకునేందుకు లక్నో సూపర్ జెయింట్స్ సిద్దమైంది.
నలుగురికే ఛాన్స్..
ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించిన రిటైన్ పాలసీ ఇంకా ఖరారు కాలేదు. కానీ 3+1 రిటెన్షన్‌కు అవకాశం ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఫ్రాంచైజీలు ముగ్గురిని నేరుగా రిటైన్ చేసుకోనుండగా.. మరొకరిని ఆర్‌టీఎమ్(రైట్ టు మ్యాచ్) కింద తీసుకోవచ్చు. ఈ రూల్ ప్రకారం వేలంలో ఏదైనా జట్టు తమ ఆటగాడిని కొనుగోలు చేస్తే ఆర్‌టీఎమ్ కింద ఆ ధరను చెల్లించి తీసుకోవచ్చు.
రిటైన్ పాలసీ ప్రకారం ఒక జట్టు గరిష్టంగా నలుగురిని(3+1) మాత్రమే రిటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ముగ్గురు భారత క్రికెటర్లు, ఒక విదేశీ క్రికెటర్ లేదా ఇద్దరు భారత క్రికెటర్లు, ఇద్దరు విదేశీ క్రికెటర్లు మాత్రమే ఉండాలి. మరోవైపు 8 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకునే అవకాశం ఇవ్వాలని ఫ్రాంచైజీలు బీసీసీఐని కోరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ డిమాండ్‌ను బీసీసీఐ అధికారులు తప్పుబట్టినట్లు తెలుస్తోంది. 8 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకున్న తర్వాత మెగా వేలం నిర్వహించడం ఎందుకు? అని ఎదురు ప్రశ్నిస్తున్నారు.
రిటైన్ చేసుకునేది ఆ నలుగురే..
(3+1) రిటెన్షన్‌కు అవకాశం ఇస్తే లక్నో సూపర్ జెయింట్స్ లక్నో సూపర్ జెయింట్స్.. విధ్వంసకర బ్యాటర్ నికోలస్ పూరన్, స్టార్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినీస్, స్పెషలిస్ట్ స్పిన్నర్ రవి బిష్ణోయ్, పేస్ సెన్సేషన్ మయాంక్ యాదవ్‌లను తీసుకునే ఛాన్స్ ఉంది. కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను లక్నో వదిలేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
హైదరాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో లక్నో సూపర్ జెయింట్స్ చిత్తుగా ఓడిన అనంతరం మైదానంలోనే రాహుల్‌ను టీమ్ ఓనర్ సంజీవ్ గోయెంకా మందలించాడు. అప్పట్లో ఈ వీడియోపై తీవ్ర దుమారం రేగింది. ఆ తర్వాత సంజీవ్ గోయెంకా.. రాహుల్‌ను ఇంటికి పిలిచి భోజనం పెట్టినా.. ఈ ఫ్రాంచైజీలో కొనసాగేందుకు లక్నో కెప్టెన్ సుముఖంగా లేడనే వార్తలు వస్తున్నాయి.