ఐపీఎల్ 2025 మెగా వేలం ఈ ఏడాది చివర్లో జరగనుంది. ఇప్పటికే వేలం ప్రక్రియపై ఫోకస్ పెట్టిన భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ).. ఇప్పటికే 10 ఫ్రాంచైల ఓనర్లతో సమావేశం నిర్వహించి రిటెన్షన్ రూల్స్ విషయంలో సలహాలు, సూచనలను స్వీకరించింది. 7-8 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకునే అవకాశం ఇవ్వాలని కొన్ని జట్లు సూచిస్తే.. నలుగురి కంటే ఎక్కువ ఛాన్స్ ఇవ్వదని మరికొన్ని జట్లు వాదించినట్లు వార్తలు వచ్చాయి.
సాధారణంగా నలుగురి నుంచి ఐదుగురిని రిటైన్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. పర్స్ వాల్యూను కూడా 20-30 కోట్లకు పెంచే అవకాశం ఉంది. అదే జరిగితే ఆటగాళ్లపై మరోసారి కనక వర్షం కురవనుంది.

మరోవైపు మెగా వేలం నేపథ్యంలో రోహిత్ శర్మకు సంబంధించి తీవ్ర చర్చ జరుగుతుంది. అతను ముంబై ఇండియన్స్ జట్టును వీడుతాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతల నుంచి రోహిత్‌ను తప్పించి హార్దిక్ పాండ్యాను నూతన కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఈ నిర్ణయంపై రోహిత్ శర్మ అసంతృప్తిగా ఉన్నాడు. ఈ క్రమంలోనే అతను ముంబై ఇండియన్స్ వీడుతాడని జోరుగా చర్చ సాగుతోంది. ఒకవేళ రోహిత్‌ను ముంబై ఇండియన్స్ వదిలేస్తే మాత్రం అతన్ని తీసుకునేందుకు ఇంతర ఫ్రాంచైజీలు కాచుకొని కూర్చున్నాయి. ముఖ్యంగా మూడు జట్లు అయితే రోహిత్ శర్మపై కోట్లు కుమ్మరించనున్నాయి.
1. చెన్నై సూపర్ కింగ్స్..
చెన్నై సూపర్ కింగ్స్ సారథ్య బాధ్యతల నుంచి ధోనీ తప్పుకున్న విషయం తెలిసిందే. రుతురాజ్ గైక్వాడ్‌ను నయా సారథిగా ఎంపిక చేసిన ఆ జట్టు.. ఐపీఎల్ 2025 మెగా వేలం నేపథ్యంలో టీమ్‌ను బిల్డ్ చేయడంపై ఫోకస్ పెట్టింది. వేలంలో రోహిత్ శర్మను తీసుకున్నా అతనికి సారథ్య బాధ్యతలు ఇచ్చే అవకాశం లేదు. కానీ రోహిత్ సాయంతో కోర్ టీమ్‌ను బిల్డ్ చేయాలనుకుంటుంది. ఈ క్రమంలోనే రోహిత్ శర్మను తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
2. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..
ఆర్‌సీబీ సారథ్య బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకున్న అనంతరం ఫాఫ్ డుప్లెసిస్ జట్టును నడిపించాడు. గత రెండు సీజన్లలో అతని సారథ్యంలోని ఆర్‌సీబీ మెరుగైన ప్రదర్శనే చేసింది. కానీ లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. వయసు రీత్యా ఫాఫ్ డుప్లెసిస్‌ను ఆ జట్టు రిటైన్ చేసుకోకపోవచ్చు. మళ్లీ సారథ్య బాధ్యతలు చేపట్టేందుకు కోహ్లీ ఆసక్తిగా లేడు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మను కొనుగోలు చేసి అతనికి సారథ్య బాధ్యతలు అప్పగించాలని ఆర్‌సీబీ భావిస్తోంది.
3.పంజాబ్ కింగ్స్..
ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పేలవ ప్రదర్శన కనబర్చిన జట్టు ఏదైనా ఉందా? అంటే అది పంజాబ్ కింగ్స్ మాత్రమే. కెప్టెన్, కోచ్‌లను మార్చినా ఆ జట్టు రాత మాత్రం మారడం లేదు. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2025 మెగావేలాన్ని ఉపయోగించుకొని సరైన జట్టును ఎంపిక చేసుకోవాలని ఆ ఫ్రాంచైజీ భావిస్తోంది. రోహిత్ శర్మకు సారథ్య బాధ్యతలు అప్పగించి.. మంచి జట్టును ఎంపిక చేయాలనే ప్రణాళికలు రచిస్తోంది. తద్వారా 17 ఏళ్ల టైటిల్ నిరీక్షణకు తెరదించాలనుకుంటోంది.