ఐపీఎల్ 2025 సీజన్‌లో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగే అవకాశాలు కనిపించడం లేదు. గత 6 ఏళ్లుగా ముంబై ఇండియన్స్ తరఫున దుమ్మురేపిన సూరీడు కోసం ఇతర ఫ్రాంచైజీలు కాచుకొని కూర్చున్నాయి. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రణాళికల ప్రకారం వచ్చే సీజన్ మెగా వేలం జరగనుంది.
సూర్యకుమార్ యాదవ్‌ను ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అయితే ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతలను ఆశించి భంగపడ్డ సూరీడు.. ఆ జట్టులో కొనసాగేందుకు ఇష్టపడకపోవచ్చు. తనను కాదని హార్దిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలను ఇవ్వడాన్ని సూర్య తట్టుకోలేకపోయాడు.

ముంబై మేనేజ్‌మెంట్ నిర్ణయంపై సోషల్ మీడియా వేదికగానే అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో ఫిట్‌నెస్ సమస్యలతో బ్యాటింగ్‌కు మాత్రమే పరిమితమైన సూర్యకుమార్ యాదవ్.. 11 మ్యాచ్‌ల్లో 345 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీతో పాటు 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే ముంబై ఇండియన్స్ జట్టు మాత్రం పేలవ ప్రదర్శనతో పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు స్థానంలో నిలిచింది.
సూరీడికి కెప్టెన్సీపై మోజు ఉంటే మాత్రం అతను ముంబై ఇండియన్స్‌ను వీడే అవకాశం ఉంది. ఒకవేళ అతను ముంబై ఇండియన్స్ రిటెన్షన్‌కు ఒప్పుకోక వేలంలోకి వస్తే భారీ ధర పలకనున్నాడు. ఈ 360 ప్లేయర్ కోసం ఫ్రాంచైజీలు ఎగబడనున్నాయి. ముఖ్యంగా ఓ మూడు జట్లు సూరీడిపై కోట్లు కుమ్మరించేందుకు సిద్దంగా ఉన్నాయి.
1. పంజాబ్ కింగ్స్
ఐపీఎల్ 2024 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ దారుణంగా విఫలమైంది. సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్‌లను కూడా చేజార్చుకొని పాయింట్స్ పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం ఆ జట్టుకు టీమిండియా స్టార్ అవసరం. శిఖర్ ధావన్ వయసు రీత్యా అతనికి పంజాబ్ గుడ్‌బై చెప్పనుంది. ఈ క్రమంలోనే సూర్య వేలంలోకి వస్తే అతనిపై భారీ ధర వెచ్చించి మరీ పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేయనుంది. పంజాబ్ కింగ్స్ సారథ్య బాధ్యతలను కూడా అప్పగించనుంది.
2. లక్నో సూపర్ జెయింట్స్..
పంజాబ్ కింగ్స్ తర్వాత సూర్య కోసం లక్నో సూపర్ జెయింట్స్ కూడా తీవ్రంగా పోటీపడనుంది. తమ కెప్టెన్ కేఎల్ రాహుల్ జట్టును వీడే అవకాశాలు ఉండటంతో లక్నో కొత్త కెప్టెన్ ఎంపికపై కసరత్తు చేస్తోంది. వేలంలోకి సూర్య వస్తే అతనిపై కోట్లు కుమ్మరించనుంది. సూర్యను కొనుగోలు చేస్తే అతనికి సారథ్య బాధ్యతలు అప్పగించవచ్చని లక్నో మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఈ క్రమంలోనే లక్నో సూపర్ జెయింట్స్ సూరీడుపై ఓ కన్నేసింది.
3 .రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)
ఆర్‌సీబీ కూడా సూర్యకుమార్ యాదవ్‌పై ఓ కన్నేసింది. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందే తమ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌కు ఆర్‌సీబీ గుడ్‌బై చెప్పే అవకాశాలు ఉన్నాయి. ఫాఫ్ డుప్లెసిస్ వయసు రీత్యా అతన్ని రిటైన్ చేసుకునే రిస్క్ ఆర్‌సీబీ తీసుకోకపోవచ్చు.
బెంగళూరు మైదానం సూర్య బ్యాటింగ్ స్టైల్‌కు బాగా సెట్ అవుతోంది. ఈ క్రమంలోనే సూరీడుపై కోట్లు కుమ్మరించేందుకు ఆర్‌సీబీ ఏ మాత్రం వెనుకడుగు వేయదు. ఒక వేళ ఆర్‌సీబీకి సూర్య చిక్కితే టీమ్ సారథ్య బాధ్యతలను అప్పగించనుంది.