ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2024)కు సంబంధించిన విండోను భారత క్రికెట్ నియంత్రణ మండలి ఖరారు చేసింది. మార్చి 22 నుంచి మే 31 వరకు ఐపీఎల్ నిర్వహించుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్‌కు బ్రేక్ ఇవ్వనుంది. అంతర్జాతీయ ఆటగాళ్లు అందుబాటులో ఉండటంపై కూడా ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌కు బీసీసీఐ సమాచారం ఇచ్చింది.
జూన్‌లో అమెరికా, వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ 2024 జరగనున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, శ్రీలంక ఆటగాళ్లు ఐపీఎల్ 2024 సీజన్ మొత్తానికి అందుబాటులో ఉంటారని తెలిపింది. ఈ మేరకు ఆ దేశ క్రికెట్ బోర్డుల తమకు సమాచారమిచ్చినట్లు ఫ్రాంచైజీలకు తెలియజేసింది.

ఇక మార్చి 11 వరకు టీమిండియా ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత నేరుగా టీ20 ప్రపంచకప్‌లోనే బరిలోకి దిగనుంది. ఐపీఎల్ 2024 సీజన్ కోసం టీమిండియా అంతర్జాతీయ షెడ్యూల్‌ను ఖరారు చేయలేదు. జూన్ 4 నుంచి జూన్ 30 మధ్య టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22 లేదా 23న ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
మే మూడో వారం చివర్లో ఐపీఎల్ 2024 ఫైనల్ జరిగే అవకాశం ఉంది. ఈ లెక్కన మే 19 లేదా మే 26న ఐపీఎల్ 2024 ఫైనల్ జరిగే అవకాశం ఉంది. అతి త్వరలోనే బీసీసీఐ.. ఐపీఎల్ 2024 సీజన్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేయనుంది.
ఐపీఎల్ షెడ్యూల్‌తో పాటు విదేశీ ఆటగాళ్లు అందుబాటులో ఉండే విషయంపై బీసీసీఐ.. ఫ్రాంచైజీలకు స్పష్టమైన సమాచారాన్ని అందజేసింది. మార్చిలో తండ్రికాబోతున్న ఆస్ట్రేలియా పేసర్ జోష్ హజెల్ వుడ్ లీగ్ మొత్తానికి అందుబాటులో ఉంటాడని తెలిపింది. ఇంగ్లండ్ లెగ్ స్పిన్నర్ రెహాన్ అహ్మద్.. ఐపీఎల్ 2024 సీజన్‌కు అందుబాటులో ఉండటం లేదని, మిగతా ప్లేయర్లు తమ అంతర్జాతీయ షెడ్యూల్‌కు అనుగుణంగా అందుబాటులో ఉంటారని తెలిపింది.
ఐపీఎల్ 2024 సీజన్‌కు సంబంధించిన మినీ వేలం మంగళవారం దుబాయ్ వేదికగా జరగనుంది. భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ వేలం షురూ కానుంది. పది ఫ్రాంచైజీల్లో గరిష్టంగా ఖాళీగా ఉన్న 70 స్థానాల కోసం 333 మంది ఆటగాళ్లు వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.