రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి బిగ్ షాక్ తగిలింది. ఐపీఎల్ నిబంధనలను ఉల్లంఘించినందుకు అతనిపై నిర్వాహకులు భారీ జరిమానా విధించారు. మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధిస్తూ చర్యలు తీసుకున్నారు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ హద్దులు ధాటి ప్రవర్తించాడు.
తన వికెట్ విషయంలో అంపైర్లతో వాగ్వాదానికి దిగడంతో పాటు అసహనంతో స్టేడియంలోని డస్ట్‌బిన్‌ను పడేసాడు. అంతటితో ఆగకుండా బ్యాట్‌ను నేలకు కొట్టాడు. ఈ ప్రవర్తనను సీరియస్‌గా తీసుకున్న మ్యాచ్ రిఫరీ ఐపీఎల్ నిబంధనల మేరకు కోహ్లీ మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధిస్తూ చర్యలు తీసుకున్నాడు.

అయితే ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఔటైన తీరుపై తీవ్ర దుమారం రేగింది. సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఔటంటే.. మరికొందరు నాటౌట్ అంటూ అంపైర్లపై విమర్శలు గుప్పించారు.
అసలేం జరిగిందంటే..?
ఆర్‌సీబీ ఇన్నింగ్స్ సందర్భంగా హర్షిత్ రాణా వేసిన మూడో ఓవర్‌లో విరాట్ కోహ్లీ(7 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 18) రిటర్న్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. హై ఫుల్‌టాస్‌గా వేసిన ఈ బంతి కోహ్లీ ఛాతి కంటే ఎత్తులో రాగా.. అతను డిఫెండ్ చేశాడు. బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి గాల్లోకి లేవగా.. హర్షిత్ రాణా అందుకున్నాడు. అంపైర్లు ఔట్ ఇవ్వగా.. ఆశ్చర్యం వ్యక్తం చేసిన విరాట్ కోహ్లీ రివ్యూ తీసుకున్నాడు.
అయితే బంతి నడుము కంటే ఎత్తులో వచ్చినా కోహ్లీ క్రీజు బయట ఉన్నాడని, బంతి డిప్ అయ్యిందని పేర్కొంటూ థర్డ్ అంపైర్ ఔటిచ్చాడు. ఈ నిర్ణయంపై కోహ్లీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. మైదానం వీడుతూ సహనం కోల్పోయిన కోహ్లీ.. అంపైర్ల వద్దకు వచ్చి నోరుపారేసుకున్నాడు. ఈ వికెట్‌పై అధికారిక బ్రాడ్‌కాస్ట్ స్టార్ స్పోర్ట్స్ సైతం సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చింది. విరాట్ కోహ్లీ క్రీజులోనే ఉంటే నడుము కంటే తక్కువ ఎత్తులోనే బంతి వచ్చేదని పేర్కొంది.