న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2024 సీజన్ దేశం బయట జరగనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఓవైపు లోక్‌సభ ఎన్నికలు.. మరోవైపు 2024 టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ నేపథ్యంలో ఐపీఎల్ 2024 సీజన్ నిర్వహణ భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐకి) తలనొప్పిగా మారింది.
సాధారణంగా ఐపీఎల్ మార్చి చివరి వారంలో ప్రారంభమై మే చివర్లో ముగుస్తోంది. అయితే జూన్ 4 నుంచి టీ20 ప్రపంచకప్ 2024 నిర్వహిస్తామని ఐసీసీ ప్రకటించింది. దాంతో ప్రపంచకప్ కోసం ఆయా దేశాల ఆటగాళ్లంతా 30 రోజుల ముందుగానే ఐపీఎల్‌ను వీడనున్నారు. భారత జట్టు కూడా కనీసం 20 రోజుల ముందు ప్రిపరేషన్ మొదలుపెట్టాల్సి ఉంటుంది.

ఇప్పటికే ఐపీఎల్ కారణంగా భారత జట్టు ఐసీసీ టోర్నీలు గెలవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2024 సీజన్ నిర్వహణ బీసీసీఐకి సవాల్‌గా మారింది. ఐపీఎల్ 2024 సీజన్‌ను కాస్త ముందుకు జరుపుదామంటే.. ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను భారత్ జనవరి 25 నుంచి మార్చి 11 వరకు ఆడనుంది.
ఈ టెస్ట్ సిరీస్ నేపథ్యంలో మార్చి మూడో వారంలోనే ఐపీఎల్‌ను ప్రారంభించే పరిస్థితి నెలకొంది. దీనికి తోడు వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. మే-జూన్ నెలల్లో వివిధ దశల్లో దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించనున్నారు. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే.. ఐపీఎల్ మ్యాచ్‌లకు అనుమతులు లభించవు.
సెక్యూరిటీ ఇబ్బందలు తలెత్తుతాయని ఆయా రాష్ట్రాలు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. గతంలో లోక్‌సభ ఎన్నికలు జరిగినప్పుడు దేశం బయటనే ఐపీఎల్ నిర్వహించారు. ఈసారి కూడా లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యేవరకు యూఏఈ లేదా శ్రీలంక వేదికగా ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించాలని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
సాధారణంగా ఐపీఎల్ 56 రోజుల పాటు జరుగుతుంది. కానీ ఈసారి 45 రోజుల్లోనే టోర్నీని ముగించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వీలైనన్ని డబుల్ హెడర్ మ్యాచ్‌లు నిర్వహించాలని బీసీసీఐ కసరత్తులు చేస్తున్నట్లు నేషనల్ మీడియా పేర్కొంది.
'ఐపీఎల్ 2024 నిర్వహణ విషయంలో మాకు అనేక సవాళ్లు ఎదురుకానున్నాయి. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్, లోక్‌సభ ఎన్నికలు.. టీ20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో ఐపీఎల్ 2024 నిర్వహణ తలనొప్పిగా మారనుంది. అయితే ఇప్పుడే ప్లాన్ చేయడం చాలా ముందస్తు అవుతోంది. ప్రస్తుతం మా ఫోకస్ అంతా అక్టోబర్‌లో జరిగే వన్డే ప్రపంచకప్ 2023 పైనే ఉంది.
ఈ టోర్నీ ముగిసిన తర్వాత డిసెంబర్-జనవరి మధ్య ఐపీఎల్ 2024 నిర్వహణ గురించి ఆలోచిస్తాం.'అని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్‌లో ఐపీఎల్ 2024 మినీ వేలం జరగనుంది.