హైదరాబాద్: ఐపీఎల్ 2024 సీజన్ కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) సమాయత్తమవుతోంది. ఇప్పటికే టీమ్ ప్రక్షాళనను ప్రారంభించిన బెంగళూరు ఫ్రాంచైజీ.. ఈ ఏడాది డిసెంబర్‌లో జరగనున్న ఐపీఎల్ 2024 మినీ వేలం కోసం ప్రణాళికలను సిద్దం చేస్తోంది. కొత్త హెడ్ కోచ్, జింబాబ్వే దిగ్గజం ఆండీ ఫ్లవర్ పర్యవేక్షణలో మినీ వేలానికి సిద్దమవుతోంది.
జట్టుకు భారమైన ఆటగాళ్లను వదులుకునేందుకు సిద్దమైన ఆర్‌సీబీ.. ఇప్పటికే రిలీజ్ చేసే ఆటగాళ్ల జాబితాను రెడీ చేసింది. గత సీజన్‌లో దారుణంగా విఫలమైన దినేశ్ కార్తీక్‌తో పాటు షెహ్‌బాజ్ అహ్మద్, సుయాశ్ ప్రభుదేశాయ్, వానిందు హసరంగా, జోష్ హజెల్ వుడ్, ఫిన్ అలెన్, ఆకాశ్ దీప్ వంటి ఆటగాళ్లను వదులుకునేందుకు సిద్దమైంది.

వీరి స్థానాల్లో జట్టుకు అవసరమయ్యే ఆటగాళ్లను తీసుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. ముఖ్యంగా ఆర్‌సీబీ లోయరార్డర్ బలహీనంగా ఉంది. బ్యాకప్ ప్లేయర్లు కూడా లేరు. విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్, గ్లేన్ మ్యాక్స్‌వెల్‌పైనే జట్టు ఆధారపడి ఉంది. జట్టులోని భారత ఆటగాళ్ల వైఫల్యం టీమ్ విజయవకాశాలను దెబ్బతీస్తోంది.
ఈ క్రమంలోనే ఆర్‌సీబీ ఓ ముగ్గురు ఆటగాళ్లపై కన్నేసినట్లు తెలుస్తోంది. టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్‌తో పాటు ఆసీస్ స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్, రవి బిష్ణోయ్‌లను తీసుకోవాలనుకుంటోంది. ఈ ముగ్గురికి సాయి సుదర్శన్, సందీప్ శర్మలను బ్యాకప్‌గా పెట్టుకుంది.
కేఎల్ రాహుల్ ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. ఐపీఎల్ 2023 సీజన్ మధ్యలోనే రాహుల్ గాయంతో జట్టుకు దూరమయ్యాడు. అతని పేలవ ఫామ్‌కు తోడు గాయాల బెడదతో లక్నో సూపర్ జెయింట్స్ తీవ్ర చికాకుకు గురవుతోంది. ఈ క్రమంలోనే అతన్ని వేలంలోకి వదిలేయాలనుకుంటోంది.

అదే జరిగి కేఎల్ రాహుల్ వేలంలోకి వస్తే మాత్రం ఆర్‌సీబీ విడిచి పెట్టదు. దినేశ్ కార్తీక్ స్థానాన్ని రాహుల్‌తో భర్తీ చేయాలనుకుంటోంది. రాహుల్ అందుబాటులోకి రాకుంటే సాయి సుదర్శన్‌ను తీసుకోవడంపై ఫోకస్ పెట్టనుంది. గత సీజన్‌కు దూరంగా ఉన్న ప్యాట్ కమిన్స్.. ఈ సారి బరిలోకి దిగే అవకాశం ఉంది.
అతను వేలంలోకి వస్తే ఫ్రాంచైజీలన్నీ పోటీపడనున్నాయి. భారీ ధర చెల్లించైనా కమిన్స్ కొనేందుకు ఆర్‌సీబీ ఆసక్తి కనబర్చే అవకాశం ఉంది.స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా వానిందు హసరంగా విఫలమవుతుండటంతో అతని స్థానంలో రవి బిష్ణోయ్‌ను తీసుకోవాలని ఆర్‌సీబీ భావిస్తోంది.