Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL పుట్టుక వెనుక ఆ ఇద్దరూ.. బీసీసీఐకి చెడు చేయబోయి మంచి చేసారు!

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) వరల్డ్ బిగ్గెస్ట్ క్రికెట్ లీగ్. గత 17 ఏళ్లుగా సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్న ఈ క్యాష్ రిచ్ లీగ్ మరో సీజన్‌‌కు రంగం సిద్దమైంది. మరో 24 గంటల్లో ఐపీఎల్ 2024 సీజన్‌కు తెరలేవనుంది. బీసీసీఐకి కాసుల వర్షం కురిపిస్తూ.. ప్రపంచ క్రికెట్‌ను శాసించే స్థాయికి బోర్డును చేర్చిన ఐపీఎల్.. ప్రారంభం వెనుక సినిమాటిక్ స్టోరీ ఉంది.

ఐపీఎల్ కంటే ముందు దేశంలో ఇండియన్ క్రికెట్ లీగ్(ఐసీఎల్) పేరిట టీ20 ఫ్రాంచైజీ లీగ్ ప్రారంభమైంది. భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్, మీడియా మొఘల్, జీ నెట్‌వర్క్ అధినేత సుభాష్ చంద్ర కలిసి ప్రారంభించిన ఈ ఐసీఎల్ అప్పట్లో ఒక సంచలనం. బీసీసీఐ బ్రాడ్‌కాస్టింగ్ హక్కుల కోసం జీ నెట్‌వర్క్ చాలా తీవ్రంగా ప్రయత్నించింది.

IPL 2024 The story behind the birth of IPL all credits to media mogul Subhash Chandra

బీసీసీఐని దెబ్బతీయాలని..
అందుకోసం జీ స్పోర్ట్స్ అనే ఛానల్‌ను కూడా ఏర్పాటు చేసింది. కానీ సుభాష్ చంద్ర ప్రయత్నాలు ఫలించలేదు. బీసీసీఐలోని బలమైన లాబీయింగ్ జీ నెట్‌వర్క్‌కు క్రికెట్ ప్రసార హక్కులు దక్కకుండా చేశారనే వాదన ఉన్నది. ఈ క్రమంలో బీసీసీఐని దెబ్బతీయాలని సుభాష్ చంద్ర భావించారు. వెంటనే కపిల్ దేవ్‌తో కలిసి బీసీసీఐకి పోటీగా ఇండియన్ క్రికెట్ లీగ్ ప్రారంభించారు.

టీ20 క్రికెట్‌కు అప్పటికి భారత్‌లో ఎలాంటి క్రేజ్ లేదు. పైగా ఈ ఫార్మాట్‌ను బీసీసీఐ వ్యతిరేకించింది. కానీ ఈ ఫార్మాట్‌నే ఉపయోగించి ఒక లీగ్ స్టార్ట్ చేయాలని భావించిన సుభాష్ చంద్ర ఐసీఎల్‌కు తెర తీశారు. లెజండరీ క్రికెటర్ కపిల్ దేవ్ చైర్మన్‌గా 2006 చివర్లో ఐసీఎల్ ప్రారంభం అయ్యింది. మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరే కూడా ఈ ఐసీఎల్‌లో పని చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు.

అంబటి రాయుడు, కౌశిక్ రెడ్డి..
అప్పట్లో భారత క్రికెట్‌లో చోటు దక్కని, అవకాశాలు రాని అనేక మంది యువ క్రికెటర్లు ఐసీఎల్‌లో ఆడారు. హైదరాబాద్‌కు చెందిన క్రికెటర్లే ఇందులో ఎక్కువగా ఉన్నారు. భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు, ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిలు కూడా ఐసీఎల్ ఆడారు. ప్రస్తుత బీసీసీఐ చైర్మన్ రోజన్ బిన్ని కొడుకు స్టువర్ట్ బిన్నీ కూడా ఐసీఎల్‌లో భాగమయ్యాడు.

నేషనల్ క్రికెట్ అకాడమీ చైర్మన్‌గా ఉన్న కపిల్ దేవ్.. బీసీసీఐకి వ్యతిరేకంగా ఐసీఎల్‌లో భాగమవ్వడంతో అతన్ని పదవి నుంచి తప్పించారు. ఐసీఎల్‌లో పని చేయడానికి, ఆడటానికి వెళ్లిన అందరిపై బీసీసీఐ నిషేధం విధించింది. దేశంలోని ఏడు ప్రాంతాల నుంచి ఫ్రాంచైజీలను ఏర్పాటు చేసి 2007లో ఐసీఎల్‌ను విజయవంతంగా నిర్వహించారు. హైదరాబాద్ హీరోస్ అనే ఫ్రాంచైజీ హైదరాబాద్ నగరానికి ప్రాతినిథ్యం ఇచ్చింది.

IPL 2024 The story behind the birth of IPL all credits to media mogul Subhash Chandra

ఐసీసీకి లేఖ
అప్పటి వరకు టెస్ట్, వన్డేలను మాత్రమే చూసిన జనాలు.. ఈ టీ20 క్రికెట్‌కు ఆకర్షితులయ్యారు. దాంతో ఈ టీ20 లీగ్‌పై దేశమంతా క్రేజ్ పెరిగింది. జనాలు స్టేడియాలకు వెళ్లి ఈ కొత్త లీగ్‌ను ఆస్వాదించారు. దాంతో కపిల్ దేవ్.. ఈ లీగ్‌ను గుర్తించాలని ఐసీసీకి లేఖ రాశాడు. అయితే బీసీసీఐ గుర్తింపులేని ఈ లీగ్‌ను తాము కూడా గుర్తించమని ఐసీసీ స్పష్టం చేసింది.

సూపర్ సక్సెస్ సాధించడంతో ఐసీఎల్‌ను పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లో కూడా విస్తరించారు. అక్కడి జట్లను కూడా ఇక్కడకు తీసుకొచ్చి ఆడించారు. దాంతో బీసీసీఐకి ఐసీఎల్ పెద్ద తలనొప్పిగా మారింది. ఐసీఎల్‌ను ధీటుగా ఎదుర్కోవాలంటే తాము కూడా ఒక లీగ్‌ను ప్రారంభించాలని భావించింది. ఇలాంటి లీగ్స్‌పై అవగాహన, అనుభవం ఉన్న లలిత్ మోడీని సంప్రదించింది.

లలిత్ మోడీ సాయంతో..
అప్పటికే లలిత్ మోడీ టీ20 లీగ్ నిర్వహణపై బీసీసీఐకి ఒక ప్రెజెంటేషన్ ఇచ్చారు. కానీ అప్పట్లో టీ20 క్రికెట్ పట్ల బీసీసీఐ ఆసక్తికనబర్చలేదు. ఐసీఎల్ తెరపైకి రావడంతో మళ్లీ వారికి లలిత్ మోడీ గుర్తుకు వచ్చాడు. అప్పటికే ఒక ఫార్మాట్ సిద్దం చేసిన ఉంచిన లలిత్ మోడీ చకచకా తన పని తాను చేసుకొని పోయాడు.

ఐసీఎల్ ప్రారంభమైన మరుసటి ఏడాదే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మొదలైంది. ప్రపంచ క్రికెట్‌లో అదో పెద్ద సంచలనంగా మారింది. బీసీసీఐ వంటి బలమైన బోర్డుకు ఐసీసీ మద్దతు కూడా లభించడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్ క్రికెటర్లు ఐపీఎల్‌ ఆడేందుకు ఆసక్తి కనబర్చారు.
తొలి సీజనే సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇలా ఒక లీగ్‌కు పోటీగా వచ్చిన ఐపీఎల్.. ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ లీగ్‌గా మారిపోయింది.

ఆ ఇద్దరే లేకుంటే..
ఆ దెబ్బకు ఐసీఎల్ రెండు సీజన్లకే పరిమితం అయ్యింది. ఆ తర్వాత కాలంలో ఐసీఎల్‌లో భాగమైన కపిల్ దేవ్, కిరణ్ మోరేలతో పాటు క్రికెటర్లపై బీసీసీఐ నిషేధం ఎత్తేసింది. ప్రపంచంలో ఈ రోజు ఐపీఎల్ ఇంత పెద్ద లీగ్‌గా మారడానికి కారణం మాత్రం జీ టీవీ సుభాష్ చంద్ర, క్రికెటర్ కపిల్ దేవ్ అని చెప్పొచ్చు.

ఆ రోజు వాళ్లు ఐసీఎల్ కనుక మొదలుపెట్టకపోతే ఐపీఎల్ ప్రారంభం మరింత ఆలస్యం అయ్యేది. లేట్‌గా స్టార్ట్ చేసినా ఇంత క్రేజ్ వచ్చేది కాదు. మొత్తానికి బీసీసీఐకి చెడు చేయాలని భావించిన జీ టీవీ సుభాష్ చంద్ర మరింత సంపన్నమైన బోర్డుగా మార్చాడు.

Story first published: Thursday, March 21, 2024, 14:53 [IST]
Other articles published on Mar 21, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+