టీమిండియా స్టార్ వికెట్ కీపర్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ రీఎంట్రీపై వరల్డ్ నెంబర్ వన్ టీ20 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఎమోషనల్ అయ్యాడు. ఐపీఎల్ 2024 సీజన్ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌తో రిషభ్ పంత్ మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టాడు. ఘోర రోడ్డు ప్రమాదం కారణంగా ఏడాదిన్నరగా ఆటకు దూరమైన పంత్.. 453 రోజుల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చాడు.
పంత్ మైదానంలోకి అడుగుపెట్టిన ఫొటోను ఇన్‌స్టా స్టోరీలో పంచుకున్న సూర్యకుమార్ యాదవ్.. ఈ రోజు కోసమే తామంతా ఎదురు చూస్తున్నామని తెలిపాడు. స్పూర్తిదాయకమైన చిత్రాలు ఎన్నో చూసినా.. ఈ రియల్ లైఫ్ స్టోరీకి మించినది ఏది లేదని భావోద్వేగానికి గురయ్యాడు.

'ఈ క్షణం కోసమే మేమంతా చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాం. నేను ఎన్నో స్పూర్తిదాయకమైన చిత్రాలను చూశాను. కానీ ఈ రియల్ లైఫ్ స్టోరీకి మించినది ఏది లేదు'అని సూర్య క్యాప్షన్‌గా పేర్కొన్నాడు.
ఇక రీఎంట్రీలో రిషభ్ పంత్(13 బంతుల్లో 2 ఫోర్లతో 18) తీవ్రంగా నిరాశపరిచాడు. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో బెయిర్ స్టోకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 2022 డిసెంబర్ 30న రిషభ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. కొత్త ఏడాది తమ కుటుంబ సభ్యులకు సర్‌ప్రైజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో చెప్పా పెట్టకుండా సొంత కారులో ఒంటరిగా ఢిల్లీ నుంచి రూర్కీకి బయలుదేరిన పంత్.. నిద్రమత్తులో డివైడర్‌ను ఢీకొట్టాడు.
అతివేగంగా కారు నడపడంతో ప్రమాధ ధాటికి అతని బీఎండబ్ల్యూ కారు పూర్తిగా దగ్దమైంది. ఆ రోడ్డుపై అటుగా వెళ్తున్న ఇతర ప్రయాణికులు రిషభ్ పంత్‌ను రక్షించారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్.. పలు శస్త్ర చికిత్సలు చేయించుకున్నాడు. ఇటీవలే పూర్తి ఫిట్‌నెస్ సాధించి ఐపీఎల్‌తో మళ్లీ ప్రొఫెషనల్ క్రికెట్ ప్రారంభించాడు. ఈ ప్రమాదంలో తాను ప్రాణాలతో బయటపడటం అద్భుతమని చెప్పిన పంత్.. మళ్లీ క్రికెట్ ఆడుతానని అనుకోలేదన్నాడు. ఏదో శక్తి తనను కాపాడిందని, ఇది తనకు పునర్జన్మని తెలిపాడు.
పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు తడబడ్డారు. డేవిడ్ వార్నర్(29), మిచెల్ మార్ష్(20), షై హోప్(33), అక్షర్ పటేల్(21), రిషభ్ పంత్(18) ఎవరూ కూడా భారీ స్కోర్లు చేయలేకపోయారు. దాంతో ఢిల్లీ క్యాపిటల్స్ సాధారణ స్కోర్‌కే పరిమితమైంది. ఇక సూర్యకుమార్ యాదవ్ చీలమండ గాయంతో బాధపడుతున్నాడు. అఫ్గానిస్థాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో గాయపడిన అతను.. ఎన్‌సీఏలో రిహాబిలిటేషన్ తీసుకుంటున్నాడు.
ఐపీఎల్ కోసం నిర్వహించిన ఫిట్‌నెస్ టెస్ట్‌లో అతను విఫలమయ్యాడు. దాంతో అతని రీఎంట్రీ మరింత ఆలస్యం కానుంది.