ఐపీఎల్ 2024 వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ దూకుడుగా వ్యవహరించింది. తమకు కావాల్సిన ఆటగాళ్లపై కోట్లు కుమ్మరించింది. దుబాయ్ వేదికగా గత నెలలో జరిగిన ఈ మినీ వేలంలో రూ. 34 కోట్ల ప్రైజ్‌మనీతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్.. జట్టు బలహీనతలను అధిగమించే ప్రయత్నం చేసింది. హెడ్ కోచ్ డానియల్ వెటోరి, స్పిన్ కోచ్ ముత్తయ్య మురళీ ధరణ్, టీమ్ ఓనర్ కావ్య మారన్‌తో కూడిన సన్‌రైజర్స్ ఆక్షన్ టీమ్.. వేలంలో చాకచక్యంగా వ్యవహరించింది.
అయితే మరోసారి విదేశీ ఆటగాళ్లపైనే ఆరెంజ్ ఆర్మీ కోట్ల రూపాయాలను ఇన్వెస్ట్ చేసింది. వరల్డ్ కప్ విజేత.. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ను రూ.20.50 కోట్ల రికార్డ్ ధరకు కొనుగోలు చేసింది. అతనికే సన్‌రైజర్స్ హైదరాబాద్ పగ్గాలు అప్పగించే అవకాశం ఉంది. అతి త్వరలోనే ఈ ప్రకటన రానుంది.

వరల్డ్ కప్ ఫైనల్లో శతక్కొట్టిన ఆసీస్ బిగ్ మ్యాచ్ ప్లేయర్ ట్రావిస్ హెడ్‌ను రూ. 6.80 కోట్లకు తీసుకున్న సన్‌రైజర్స్.. మాజీ వరల్డ్ నెంబర్ వన్ టీ20 బౌలర్ వానిందు హసరంగాను కోటిన్నరకు కొనుగోలు చేసింది. దేశవాళీ ప్లేయర్లలో జయదేవ్ ఉనాద్కత్, ఆకాశ్ సింగ్, సుబ్రమణ్యన్‌లను తీసుకుంది. మరోసారి తెలుగు ప్లేయర్లకు మొండి చెయ్యే చూపించింది.
జట్టు నిండా వరల్డ్ క్లాస్ ప్లేయర్లు ఉన్నా.. స్వదేశీ ఆటగాళ్లు రాణించడంపైనే సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయవకాశాలు ఆధారపడి ఉన్నాయి. విదేశీ ఆటగాళ్లలో నలుగురికి మాత్రమే ఆడే అవకాశం ఉన్న నేపథ్యంలో దేశవాళీ స్టార్లు చెలరేగితేనే సన్‌రైజర్స్‌కు తిరుగుండదు. గత మూడు సీజన్లలో సన్‌రైజర్స్ తీవ్రంగా నిరాశపరిచింది. ఈ క్రమంలోనే జట్టును పూర్తిగా ప్రక్షాళన చేసిన ఆరెంజ్ ఆర్మీ.. కొత్త కోచ్, సరికొత్త టీమ్‌తో సత్తా చాటేందుకు సిద్దమవుతోంది.
టీమ్ కాంబినేషన్ ఏంటంటే..?
లెఫ్ట్ రైట్ కాంబినేషన్‌తో ఓపెనర్లుగా మయాంక్ అగర్వాల్, ట్రావిస్ హెడ్ బరిలోకి దిగనున్నారు. డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టో తర్వాత ఆ స్థాయిలో సన్‌రైజర్స్ ఓపెనర్లు రాణించలేదు. మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మలు ఒకటి రెండు ఇన్నింగ్స్‌ల్లో పర్వాలేదనిపించినా నిలకడగా రాణించలేకపోయారు. ఈ క్రమంలోనే సన్‌రైజర్స్.. స్పెషలిస్ట్ టాపార్డర్ బ్యాటర్ అయిన ట్రావిస్ హెడ్‌ను తీసుకుంది.
మిడిలార్డర్‌లో రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్‌రమ్, హెన్రీచ్ క్లాసెన్ బరిలోకి దిగనున్నారు. రాహుల్ త్రిపాఠి తన స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిస్తే సన్‌రైజర్స్‌కు తిరుగుండదు. మార్క్‌రమ్, హెన్రీచ్ క్లాసెన్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. ఎక్స్‌ట్రా ఓవర్‌సీస్ పేసర్‌ను తీసుకోవాలనుకుంటే మార్క్‌రమ్, ట్రావిస్ హెడ్‌లో ఒకరు బెంచ్‌కు పరిమితం కావాల్సి ఉంటుంది.
ఆరోస్థానంలో బిగ్ హిట్టర్ అయిన అబ్దుల్ సమద్ లేదా ఉపేంద్ర యాదవ్‌లో ఒకరు బరిలోకి దిగనున్నారు. స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఆడనుండగా.. అతనికి షెహ్‌బాజ్ అహ్మద్ నుంచి పోటీ ఉండనుంది. పేసర్లుగా ప్యాట్ కమిన్స్‌తో పాటు ఉమ్రాన్ మాలిక్, టీ నటరాజన్, భువనేశ్వకుమార్ బరిలోకి దిగనున్నారు. మార్కో జాన్సెన్‌ను తుది జట్టులోకి తీసుకుంటే నటరాజన్, ఉమ్రాన్ మాలిక్‌లో ఒకరు బెంచ్‌కే పరిమితం అవుతారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు(అంచనా)
మయాంక్ అగర్వాల్, ట్రావిస్ హెడ్, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్‌రమ్, హెన్రీచ్ క్లాసెన్(కీపర్), అబ్దుల్ సమద్/ఉపేంద్ర యాదవ్, ప్యాట్ కమిన్స్, వాషింగ్టన్ సుందర్/షెహ్‌బాజ్ అహ్మద్, ఉమ్రాన్ మాలిక్, టీ నటరాజన్, భువనేశ్వర్ కుమార్
సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి జట్టు
అబ్దుల్ సమద్, ఎయిడెన్ మార్క్‌రమ్, రాహుల్ త్రిపాఠి, గ్లేన్ ఫిలిప్స్, హెన్రీచ్ క్లాసెన్, మయాంక్ అగర్వాల్, అన్‌మోల్ ప్రీత్ సింగ్, ఉపేంద్ర సింగ్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, షెహ్‌బాజ్ అహ్మద్, అభిషేక్ శర్మ, మార్కో జాన్సెన్, వాషింగ్టన్ సుందర్, సన్వీర్ సింగ్, భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, ఫజలక్ ఫరూఖీ, ట్రావిస్ హెడ్( రూ. 6.80 కోట్లు), వానిందు హసరంగా(రూ. 1.5 కోట్లు), ప్యాట్ కమిన్స్(రూ. 20.50 కోట్లు), జయదేవ్ ఉనాద్కత్(రూ. 1.60 కోట్లు), ఆకాశ్ సింగ్(రూ. 20 లక్షలు), జాథవెద్ సుబ్రమణ్యన్(రూ. 20 లక్షలు)