ఐపీఎల్ 2024 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రికార్డ్ స్కోర్ నమోదు చేయడంపై ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ నవ్వులు పూయించాడు. తాను బ్యాటర్‌గానే ఉండాలనుకుంటున్నానని, అస్సలు బౌలింగ్ చేయనని చమత్కరించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 25 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్ అనంతరం తమ మాట్లాడిన ప్యాట్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'నేను బ్యాటర్‌గానే ఉండాలనుకుంటున్నాను(నవ్వుతూ). కొన్ని వారాల క్రితం ముంబై ఇండియన్స్‌పై మేం భారీ స్కోర్ చేసిన అనంతరం మళ్లీ అలాంటి మ్యాచ్ జరగదనుకున్నాను. క్రికెట్‌లోనే ఇదో అత్యద్భుతమైన మ్యాచ్.

అసాధారణ దృశ్యాలు ఈ మ్యాచ్‌లు కనిపించాయి. చాలా సరదాగా కూడా అనిపించింది. ఇలాంటి మ్యాచ్‌ల్లో బౌలర్‌గా మన సాయశక్తులా చేయాల్సింది చేయాలి. ఒక్క ఓవర్‌లో 7, 8 పరుగులు ఇచ్చినా.. అది గేమ్‌పై ప్రభావం చూపుతోంది. నేను పిచ్‌ను రీడ్ చేసే అలవాటును మానుకున్నాను.
చిన్నస్వామి వికెట్ పోడిగా కనిపించింది. వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలవడం సంతోషంగా ఉంది. బ్యాటర్ల ముఖాల్లో చిరునవ్వులు కనిపించాయి. వారు స్వేచ్చగా బ్యాటింగ్ చేయడం గొప్పగా అనిపించింది. మా బౌలర్లు కూడా అసాధారణ ప్రదర్శన కనబర్చారు.'అని ప్యాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 287 పరుగుల భారీ స్కోర్ చేసింది. ట్రావిస్ హెడ్(41 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్స్‌లతో 102) సెంచరీతో చెలరేగగా.. హెన్రీచ్ క్లాసెన్(31 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్స్‌లతో 67), ఎయిడెన్ మార్క్‌రమ్(17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32 నాటౌట్), అబ్దుల్ సమద్(10 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37 నాటౌట్) మెరుపులు మెరిపించారు.
ఇదే సీజన్‌లో ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 277 పరుగుల రికార్డ్ నమోదు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. తాజా మ్యాచ్‌తో ఆ రికార్డ్‌ను మరింత మెరుగుపరుచుకుంది. టీ20 క్రికెట్ చరిత్రలోనే 287/3 అత్యధిక స్కోర్ నమోదు చేసిన రికార్డును అందుకుంది.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 262 పరుగులే చేసి ఓటమిపాలైంది. దినేశ్ కార్తీక్(35 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 83), ఫాఫ్ డుప్లెసిస్(28 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 62)హాఫ్ సెంచరీలతో చెలరేగినా ఫలితం లేకపోయింది. విరాట్ కోహ్లీ(20 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42) సైతం మెరుపులు మెరిపించాడు. సన్‌రైజర్స్ బౌలర్లలో ప్యాట్ కమిన్స్(3/43) మూడు వికెట్లు తీయగా.. మయాంక్ మార్కండే(2/46) రెండు వికెట్లు తీసాడు. నటరాజన్‌కు ఓ వికెట్ దక్కింది.