సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలోనే లక్ష్యచేధనలోనే అత్యంత భారీ విజయం నమోదు చేసిన జట్టుగా నిలిచింది. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. 166 పరుగుల లక్ష్యాన్ని 9.4 ఓవర్లలోనే ఛేదించి 62 బంతులు మిగిలి ఉండగానే గెలుపొందింది.
దాంతో ఐపీఎల్ చరిత్రలోనే 100 ప్లస్ లక్ష్యాన్ని ఎక్కువ బంతులు మిగిలి ఉండగా చేధించిన జట్టుగా నిలిచింది. అంతేకాకుండా పవర్ ప్లేలో రెండు సార్లు 100 పరుగులు చేసిన తొలి జట్టుగా చరిత్రకెక్కింది. ఈ సీజన్‌లోనే సన్‌రైజర్స్ రెండు సార్లు పవర్ ప్లేలో 100 ప్లస్ పరుగులు చేయడం గమనార్హం. ఐపీఎల్‌లో 10 ఓవర్ల తర్వాత అత్యధిక పరుగులు చేసిన జట్టుగా కూడా హైదరాబాద్ రికార్డు సాధించింది.

ఐపీఎల్ చరిత్రలో బంతుల పరంగా భారీ విజయం సాధించిన జట్లు(100 ప్లస్ లక్ష్యాలు):
62 సన్‌రైజర్స్ vs లక్నో, హైదరాబాద్ 2024 (లక్ష్యం: 166) *
57 ఢిల్లీ vs పంజాబ్, బ్రాబౌర్న్ 2022 (లక్ష్యం: 116)
48 డెక్కన్ ఛార్జర్స్ vs ముంబై ఇండియన్స్, 2008 (లక్ష్యం: 155)
ఐపీఎల్‌లో 10 ఓవర్ల తర్వాత అత్యధిక పరుగులు చేసిన జట్లు:
167/0 (9.4) సన్‌రైజర్స్ vs లక్నో, హైదరాబాద్ 2024 *
158/4 సన్‌రైజర్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్, ఢిల్లీ 2024
148/2 సన్‌రైజర్స్ vs ముంబై, హైదరాబాద్ 2024
141/2 ముంబై vs సన్‌రైజర్స్, హైదరాబాద్ 2024
ఐపీఎల్‌లో అత్యధిక పవర్‌ప్లే లక్ష్యాలు
125/0 సన్‌రైజర్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్, ఢిల్లీ 2024
107/0 సన్‌రైజర్స్ vs లక్నో, హైదరాబాద్ 2024
105/0 కేకేఆర్ vs ఆర్‌సీబీ, బెంగళూరు 2017
100/2 సీఎస్‌కే vs పంజాబ్ కింగ్స్, వాంఖడే 2014
93/1 పంజాబ్ కింగ్స్ vs కేకేఆర్, కోల్‌కతా 2024
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 165 పరుగులు చేసింది. ఆయుష్ బదోని(30 బంతుల్లో 9 ఫోర్లతో 55), నికోలస్ పూరన్(26 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 48) విధ్వంసకర బ్యాటింగ్‌తో రాణించారు.
కేఎల్ రాహుల్(33 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 29), కృనాల్ పాండ్యా(21 బంతుల్లో 2 సిక్స్‌లతో 24) పరిస్థితులకు తగ్గట్లు కీలక ఇన్నింగ్స్ ఆడారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్(2/12) రెండు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ల సంచలన బ్యాటింగ్‌తో 9.4 ఓవర్లలోనే 167 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. లక్నో బ్యాటర్లు తడబడిన పిచ్‌పై సన్‌రైజర్స్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఈ విజయంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ మెరుగైన రన్‌రేట్‌తో పాయింట్స్ టేబుల్‌లో మూడో స్థానానికి చేరింది. అధికారికంగా ప్లే ఆఫ్స్ బెర్త్‌కు అడుగు దూరంలో నిలిచింది.