బ్యాటింగ్‌లో 10-15 పరుగులు తక్కువ చేయడం తమ ఓటమిని శాసించిందని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ సామ్ కరణ్ తెలిపాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 142 పరుగులకు కుప్పకూలింది. ప్రభ్‌సిమ్రాన్ సింగ్(21 బంతుల్లో 3 ఫోర్లతో 35), హర్‌ప్రీత్ బ్రార్(12 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 29), సామ్ కరణ్(19 బంతుల్లో 2 ఫోర్లతో 20) టాప్ స్కోరర్లుగా నిలిచారు.

గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో సాయికిషోర్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. మోహిత్ శర్మ, నూర్ అహ్మద్ రెండేసి వికెట్లు తీయగా.. రషీద్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టాడు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన గుజరాత్ టైటాన్స్ 19.1 ఓవర్లలో 7 వికెట్లకు 146 పరుగులు చేసి 5 బంతులు మిగిలి ఉండగానే గెలుపొందింది.
శుభ్‌మన్ గిల్(29 బంతుల్లో 5 ఫోర్లతో 35), సాయి సుదర్శన్(34 బంతుల్లో 3 ఫోర్లతో 31) టాప్ స్కోరర్లుగా నిలవగా.. రాహుల్ తెవాటియా(18 బంతుల్లో 7 ఫోర్లతో 36 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్ మూడు వికెట్లు తీయగా.. లియామ్ లివింగ్ స్టోన్ రెండు వికెట్లు పడగొట్టాడు. అర్ష్‌దీప్ సింగ్‌కు ఓ వికెట్ దక్కింది.
ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన సామ్ కరణ్.. బ్యాటింగ్‌లో మరో 15 పరుగులు చేసుంటే ఫలితం మరోలా ఉండేదని చెప్పాడు. 'బ్యాటింగ్‌లో మేం 10-15 పరుగులు తక్కువ చేశాం. అయినా బంతితో అద్భుత ప్రదర్శన కనబర్చాం. విజయం కోసం మే పోరాడిన తీరు... మా కమిట్‌మెంట్ అద్భుతం. కానీ ఈ పోరాటం సరిపోలేదు.
అఫ్గానిస్థాన్ స్పిన్నర్లు వరల్డ్ క్లాస్ బౌలర్లు. సౌయికిషోర్ అద్బుతంగా బౌలింగ్ చేశాడు. ఈ ముగ్గురే అసాధారణ ప్రదర్శనతో మా విజయవకాశాలను దెబ్బతీసారు. ఈ పిచ్‌ను ఉపయోగించుకోవడం మూడో సారి. 160 పరుగులు చేసుంటే ఫలితం మరోలా ఉండేది.
పవర్ ప్లేలో ప్రభ్‌సిమ్రాన్ అద్భుతంగా ఆడాడు. కానీ దురదృష్టవశాత్తు అతని వికెట్ తర్వాత మేం వరుసగా వికెట్లు కోల్పోయాం. టోర్నీలో నిలవాలంటే ఇప్పుడేం చేయాలో మాకు తెలుసు. ప్రతీ మ్యాచ్ గెలవాల్సిందే.'అని సామ్ కరణ్ చెప్పుకొచ్చాడు.