పిచ్ కండిషన్స్ తగ్గ ప్రణాళికలతో బౌలింగ్ చేసి రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించామని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో చెపాక్ మైదానం వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన సీఎస్‌కే 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన రుతురాజ్ గైక్వాడ్.. ఈ విజయం ఎంతో సంతోషాన్నిచ్చిందని తెలిపాడు. సొంతమైదానంలో చివరి మ్యాచ్ గెలవడం ప్రత్యేకమైన అనుభూతినిస్తోందని చెప్పాడు.

'సొంత మైదానంలో చివరి మ్యాచ్ గెలవడం సంతోషంగా ఉంది. అద్భుతమైన అనుభూతినిస్తోంది. స్వల్ప లక్ష్యచేధనలో పవర్ ప్లే తర్వాత వికెట్లు కోల్పోయాం. కానీ మ్యాచ్‌ను ముగించే బ్యాటర్లు ఉండటంతో ఎలాంటి ఒత్తిడికి గురవ్వలేదు. మా బౌలర్లు పై చేయి సాధించే ఇలాంటి పిచ్‌లపై మేం ఆడాలనుకుంటున్నాం.
పిచ్ నెమ్మదిగా ఉన్నప్పుడు వికెట్ టు వికెట్ బౌలింగ్ చేయడం మా వ్యూహం. కానీ కొన్నిసార్లు వికెట్ ఫ్లాట్‌గా మారినప్పుడు యార్కర్లు, షాట్ బాల్స్ వేయడం కీలకం అవుతోంది. 'అని రుతురాజ్ గైక్వాడ్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 141 పరుగులు చేసింది. రియాన్ పరాగ్(35 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 47 నాటౌట్) ఒక్కడే రాణించగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. సిమర్జిత్ సింగ్(3/26) మూడు వికెట్లు తీయగా.. తుషార్ దేశ్‌పాండే(2/30) రెండు వికెట్లు పడగొట్టాడు.
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 18.2 ఓవర్లలోనే 5 వికెట్లకు 145 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్(41 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 42 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ రెండు వికెట్లు తీయగా.. నండ్రే బర్గర్, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ తీసారు. ఈ విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్స్ టేబుల్‌లో మూడో స్థానానికి చేరింది. ప్లే ఆఫ్స్ అవకాశాలను మెరుగుపరుచుకుంది.