ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. మైదానంలో ఒక్కసారిగా స్పైడర్ కెమెరా కుప్పకూలింది. దాంతో మ్యాచ్‌కు కాసేపు అంతరాయం కలిగింది. స్పైడర్ కామ్ కేబుల్ వైర్ తెగడంతో పడిపోయింది.
అదృష్టవశాత్తు స్పైడర్ కెమెరా పడిన చోట ఆటగాళ్లు లేకపోవడం ఘోర ప్రమాదం తప్పింది. ఏ ఫీల్డర్‌పైన అయిన పడి ఉంటే అతను తీవ్రంగా గాయపడేవాడు. ఈ అనూహ్య ఘటనతో ఆటగాళ్లు అవాక్కయ్యారు. ఒక్కసారిగా మైదానంలో కెమెరా కూలడంతో ఏం జరిగిందోనని ఆందోళనకు గురయ్యారు.

ఈ మ్యాచ్ తొలి ఓవర్‌లోనే ఈ ఘటన చోటు చేసుకుంది. అనంతరం కెమెరా సిబ్బంది హుటాహుటినా స్పైడర్ కెమెరాను సెట్ చేయడంతో ఆట తిరిగి ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ తెలిపాడు. ఈ మ్యాచ్ తొలి ఓవర్‌ను మోహ్‌సిన్ ఖాన్ వేయగా.. రెండు బంతులు పూర్తయిన వెంటనే స్పైడర్ కెమెరా కూలడంతో ఆటకు అంతరాయం కలిగింది.
రాజస్థాన్ రాయల్స్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ జోస్ బట్లర్(11) నవీన్ ఉల్ హక్ బౌలింగ్‌లో వెనుదిరగ్గా.. యశస్వి జైస్వాల్(24)ను మోహ్‌సిన్ ఖాన్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో రాజస్థాన్ రాయల్స్ పవర్ ప్లేలో 2 వికెట్లకు 54 పరుగులు చేసింది. క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సంజూ శాంసన్, రియాన్ పరాగ్ దూకుడుగా ఆడుతున్నారు. 33 బంతుల్లో సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.