ఐపీఎల్ 2024 సీజన్ టైటిల్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) గెలుచుకుంటుందని ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్, ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ అన్నాడు. ఈ సీజన్‌లో ఆ జట్టు కనబర్చిన అసాధారణ ప్రదర్శన చూస్తుంటే టైటిల్ గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నాడు.
ఈ టోర్నీ ఫస్టాఫ్ సీజన్‌లో 8 మ్యాచ్‌లకు ఒకే ఒక్క విజయం సాధించిన ఆర్‌సీబీ.. ఆ తర్వాత వరుసగా 6 విజయాలతో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. తమ చివరి లీగ్ మ్యాచ్‌లో పటిష్టమైన చెన్నై సూపర్ కింగ్స్‌ను మట్టికరిపించింది. ఈ గెలుపుతో పాటు మెరుగైన రన్‌రేట్‌తో టోర్నీలో ముందడుగు వేసింది. ఆర్‌సీబీ టైటిల్ గెలవాలంటే మరో మూడు మ్యాచ్‌లు గెలవడం కీలకం.

ఈ టోర్నీ ముగియగానే జూన్ 1 నుంచి అమెరికా వేదికగా టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ నేపథ్యంలో ఐసీసీ వెబ్‌సైట్‌తో రికీ పాంటింగ్ మాట్లాడాడు. ఈ సందర్భంగా ఆర్‌సీబీ ఐపీఎల్ టైటిల్ గెలుస్తుందని జోస్యం చెప్పాడు.
'గత 6 మ్యాచ్‌ల్లో ఆర్‌సీబీ అసాధారణ ప్రదర్శన కనబర్చింది. ఈ సీజన్ టైటిల్‌ను ఆ జట్టు గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.'అని పాంటింగ్ చెప్పుకొచ్చాడు. ఇక విరాట్ కోహ్లీ స్ట్రైక్‌రేట్‌పై వస్తున్న విమర్శలను పాంటింగ్ తప్పుబట్టాడు. కోహ్లీలాంటి ఆటగాడిని పక్కనపెట్టడం సరికాదన్నాడు.
'నేను టీమిండియా సెలెక్టర్‌గా ఉంటే ముందుగా విరాట్ కోహ్లీని ఎంపిక చేసేవాడిని. విరాట్ కోహ్లీపై వస్తున్న విమర్శలు చాలా ఫన్నీగా ఉన్నాయి. కొంతమంది పనిగట్టుకొని కోహ్లీ టీ20 ఫార్మాట్‌కు పనికిరాడనే కారణాలను వెతుకుతున్నారనిపిస్తోంది. ఇతర ఆటగాళ్లతో కోహ్లీ పోల్చుతూ.. విమర్శలు గుప్పించే ప్రయత్నం చేస్తున్నారు.

టాపార్డర్‌లో కోహ్లీ తన పాత్ర సమర్థవంతంగా నిర్వర్తించగలడు. సూర్యకుమార్ యాదవ్ తన జోరును కొనసాగిస్తే.. రోహిత్ శర్మ కూడా చెలరేగుతాడు. టాప్-3 బ్యాటర్లు రాణిస్తే ఇతర బ్యాటర్లు స్వేచ్చగా బ్యాటింగ్ చేయగలరు.
టీ20 ఫార్మాట్ నాలుగేళ్ల క్రితం ఉన్నట్లు లేదు. పూర్తిగా మారిపోయింది. 60 బంతులాడి 80, 100 పరుగులు చేసేవారి కంటే.. 15 బంతుల్లో 40 పరుగులు చేసేవారు మ్యాచ్ ఫలితాన్ని తారు మారు చేస్తున్నారు.'అని పాంటింగ్ చెప్పుకొచ్చాడు.