ఐపీఎల్ 2024 సీజన్‌లో వరుస పరాజయాలతో చతికిల పడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) సరికొత్త రికార్డు నమోదు చేసింది. టీ20 క్రికెట్ చరిత్రలోనే చేజింగ్‌లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా చరిత్రకెక్కింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో సోమవారం జరిగిన హైస్కోరింగ్ గేమ్‌లో ఆర్‌సీబీ 25 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 287 పరుగుల భారీ స్కోర్ చేసింది. ట్రావిస్ హెడ్(41 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్స్‌లతో 102) సెంచరీతో చెలరేగగా.. హెన్రీచ్ క్లాసెన్(31 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్స్‌లతో 67) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 262 పరుగులే చేసి ఓటమిపాలైంది. దినేశ్ కార్తీక్(35 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 83), ఫాఫ్ డుప్లెసిస్(28 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 62)హాఫ్ సెంచరీలతో చెలరేగినా ఫలితం లేకపోయింది. ఈ మ్యాచ్‌లో ఓడినా.. ఛేజింగ్‌లో 250 ప్లస్ రన్స్ చేసిన తొలి జట్టుగా నిలిచింది.
ఆర్‌సీబీ చేజింగ్ రికార్డ్..
ఈ సీజన్‌లోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ ధాటికి తమ పేరిట ఉన్న అత్యధిక స్కోర్ రికార్డును చేజార్చుకున్న ఆర్‌సీబీ.. చేజింగ్‌లో 262 పరుగులు చేసి సరికొత్త రికార్డ్ అందుకుంది. ఇదే సీజన్‌లో ముంబై ఇండియన్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన హై స్కోరింగ్ గేమ్‌లో 246/5 స్కోర్ నమోదు చేసింది. చేజింగ్‌లో ఇప్పటి వరకు ఇదే అత్యధిక స్కోర్‌గా ఉండగా.. తాజాగా ఆర్‌సీబీ బ్రేక్ చేసింది.
అత్యధిక బౌండరీలు.. పరుగులు..
ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల కలిపి 549 పరుగులు చేశాయి. ఐపీఎల్ చరిత్రలోనే ఇది రికార్డ్. సన్‌రైజర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లో 523 పరుగులు నమోదయ్యాయి.
ఈ మ్యాచ్‌లో మొత్తం 43 ఫోర్లు, 38 సిక్స్‌లతో 81 బౌండరీలు నమోదయ్యాయి. టీ20 క్రికెట్ చరిత్రలోనే ఇది అత్యధికం. 2023లో వెస్టిండీస్ వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్‌లోనూ 81 బౌండరీలు నమోదయ్యాయి. ఇందులో 46 ఫోర్లు, 35 సిక్స్‌లు కొట్టారు.