ఐపీఎల్ 2024 సీజన్‌కు రంగం సిద్దమైంది. మరో నాలుగు రోజుల్లో ఈ క్యాష్ రిచ్ లీగ్‌కు తెరలేవనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)ల మధ్య మార్చి 22(శుక్రవారం)న చెన్నైలోని చెపాక్ మైదానం వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది.
ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు అభిమానులు పోటీపడుతున్నారు. పేటీఎమ్ ఇన్‌సైడర్ వెబ్‌సైట్, యాప్ వేదికగా ఈ మ్యాచ్ టికెట్లు విక్రయిస్తున్నారు. ఈ మ్యాచ్ టికెట్ల కోసం లక్షలాది మంది అభిమానులు పోటీ పడుతున్నారు. దాంతో టికెట్ల కోసం భారీ డిమాండ్ ఏర్పడింది. పేటీఎం యాప్‌లో టికెట్లు కావాలనుకుంటున్న అభిమానులకు వెయిటింగ్ లిస్ట్ చూపిస్తోంది.

టికెట్ల కోసం భారీ డిమాండ్..
ఇప్పటికే 50 వేల మంది టికెట్ల కోసం వెయిట్ చేస్తున్నారు. చెపాక్ స్టేడియం కెపాసిటీ 38, 200 కాగా.. ఇందులో 8000 టికెట్ల వరకు కాంప్లిమెంటరీ పాస్‌ల కింద పోతాయి. మిగిలిన 30 వేల టికెట్ల కోసం అభిమానులు పోటెత్తారు. ఈ డిమాండ్ ఎలా ఉందంటే.. అంతర్జాతీయ క్రికెటర్ అయిన అశ్విన్ కూడా టికెట్ల కోసం చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీని అడిగేంత.
లోకల్ భాయ్ అయిన అశ్విన్‌కు కూడా ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ టికెట్లు దొరకడం లేదంటే ఈ మ్యాచ్‌కు ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. మ్యాచ్‌కు ముందు ఆరంభ వేడుకలు జరగనుండటం.. ప్రముఖ సెలెబ్రిటీలు తమ ఆట పాటలతో అలరించే అవకాశం ఉండటంతో అభిమానులు తెగ ఆసక్తి చూపిస్తున్నారు.
అశ్విన్ స్పెషల్ రిక్వెస్ట్..
అంతేకాకుండా సుదీర్ఘ సమయం తర్వాత విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ మైదానంలో అడుగుపెడుతుండటంతో వారిని ప్రత్యక్షంగా చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. తమ పిల్లలు ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ చూడాలనుకుంటున్నారని, టికెట్లు కావాలని అశ్విన్.. ఎక్స్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీకి రిక్వెస్ట్ చేశాడు.
'చెపాక్ వేదికగా సీఎస్‌కే వర్సెస్ ఆర్‌సీబీ మధ్య జరగనున్న ఐపీఎల్ 2024 ఆరంభ మ్యాచ్‌కు ఉన్న డిమాండ్‌ను నమ్మలేకపోతున్నా. మా పిల్లలు ఐపీఎల్ ఆరంభ వేడుకలను చూడాలనుకుంటున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ కొంచెం సాయం చేయండి.. ప్లీజ్'అని అశ్విన్ ట్వీట్ చేశాడు.
భారీ పెరిగిన టికెట్ ధరలు..
అయితే ఈ ట్వీట్‌పై సీఎస్‌కే ఫ్రాంచైజీ ఇంకా స్పందించలేదు. అభిమానులు మాత్రం వెయిటింగ్ లిస్ట్ చూపిస్తోందని, బ్లాక్‌లో అమ్ముతున్నారని కామెంట్ చేస్తున్నారు. ఐపీఎల్‌లో అశ్విన్.. రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. గత సీజన్లతో పోల్చితే ఐపీఎల్ టికెట్ల రేట్లను బాగా పెంచేసారు. గతంలో ప్రారంభ ధర రూ. 800 ఉండగా.. ఇప్పుడు రూ. 1700 చేశారు. ఈ సారి టికెట్లు రూ.1700 నుంచి రూ. 7500 వరకు ఉన్నాయి.