ఐపీఎల్ 2024 సీజన్ తుది దశకు చేరింది. 70 లీగ్ మ్యాచ్ అనంతం పాయింట్స్ టేబుల్‌లో టాప్-4లో నిలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్), సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH),రాజస్తాన్ రాయల్స్(RR),రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి.
టోర్నీ రూల్స్ ప్రకారం టాప్-2లో నిలిచిన కేకేఆర్, ఎస్‌ఆర్‌హెచ్ మంగళవారం అహ్మదాబాద్ వేదికగా జరగనున్న తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు ముందు కేకేఆర్ ప్లే ఆఫ్స్ రికార్డ్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులను కలవరపెడుతోంది. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో కేకేఆర్ 13 సార్లు ప్లే ఆఫ్స్ చేరింది.

ఇందులో రెండు సార్లు టైటిల్ గెలిచిన ఆ జట్టు.. ఐదు సార్లు ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఓవరాల్‌గా 8 సార్లు ప్లే ఆఫ్స్‌లో కేకేఆర్ గెలిచింది.
ఐపీఎల్ 2011: గౌతమ్ గంభీర్ సారథ్యంలో కేకేఆర్ తొలిసారి 2011లో ప్లే ఆఫ్స్ చేరింది. ఆ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఎలిమినేటర్‌లో 4 వికెట్ల తేడాతో ఓడి ఇంటిదారి పట్టింది.
ఐపీఎల్ 2012: ఆ మరుసటి ఏడాది మరోసారి గంభీర్ సారథ్యంలోనే ప్లే ఆఫ్స్ చేరిన కేకేఆర్.. క్వాలిఫయర్-1లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను 18 పరుగులతో ఓడించి ఫైనల్ చేరింది. ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి తొలి టైటిల్‌ను కైవసం చేసుకుంది.
ఐపీఎల్ 2014: గంభీర్ సారథ్యంలోనే 2014లో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన కేకేఆర్.. ఫస్ట్ క్వాలిఫయర్‌లో పంజాబ్ కింగ్స్‌ను 28 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్ చేరింది. మళ్లీ ఫైనల్లో పంజాబ్‌ను 3 వికెట్ల తేడాతో ఓడించి రెండో సారి టైటిల్ అందుకుంది.
ఐపీఎల్ 2016: రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ 2016లో ప్లే ఆఫ్స్ చేరిన కేకేఆర్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో 22 పరుగుల తేడాతో ఓడి ఇంటిదారి పట్టింది.
ఐపీఎల్ 2017: ఆ మరుసటి ఏడాది మళ్లీ ప్లే ఆఫ్స్ చేరిన కేకేఆర్.. ఈసారి ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్‌ను 7 వికెట్లతో ఓడించి ప్రతీకారం తీర్చుకుంది. క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్ చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.

ఐపీఎల్ 2018: వరుసగా మూడో ఏడాది ప్లే ఆఫ్స్ చేరిన కేకేఆర్.. ఎలిమినేటర్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను 25 పరుగుల తేడాతో ఓడించింది. కానీ రెండో క్వాలిఫయర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో 14 పరుగుల తేడాతో ఓటమిపాలై ఇంటిదారి పట్టింది.
ఐపీఎల్ 2021: ఆ తర్వాత రెండేళ్ల పాటు తీవ్రంగా నిరాశ పరిచిన కేకేఆర్.. 2021లో మరో ప్లే ఆఫ్స్ చేరింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 4 వికెట్ల తేడాతో ఓడించిన ఆ జట్టు.. రెండో క్వాలిఫయర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను 3 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్‌కు చేరింది. కానీ ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 27 పరుగులతో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది.
ఐపీఎల్ 2024: ఆ తర్వాత రెండేళ్లు తీవ్రంగా నిరాశపరిచిన కేకేఆర్.. మెంటార్‌గా గంభీర్ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వడంతో సంచలన ప్రదర్శనతో టేబుల్ టాపర్‌గా నిలిచి క్వాలిఫయర్-1కు సిద్దమైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడిస్తుందా..? గతంలో మాదిరి ఓడిపోతుందా? అనేది చూడాలి.