టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ నయా కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై మాజీ పేసర్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్ ఆడకుండా నేరుగా ఐపీఎల్ 2024 సీజన్ ఆడేందుకు సిద్దమవుతుండటాన్ని అతను తప్పుబట్టాడు. ఫ్రాంచైజీ మారడాన్ని కూడా విమర్శించిన ప్రవీణ్ కుమార్.. డబ్బుల కోసం ఇంత దిగజారాలా? అని అసహనం వ్యక్తం చేశాడు.
వన్డే ప్రపంచకప్ 2023లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో చీలమండ గాయానికి గురైన హార్దిక్ పాండ్యా ఆ టోర్నీ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నాడు. అప్పటి నుంచి అతను మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టలేదు. కానీ ఐపీఎల్ ఆడేందుకు తీవ్రంగా శ్రమించాడు. గంటలు తరబడి జిమ్‌లో కసరత్తు చేశాడు.

ఐపీఎల్ 2024 సీజన్ మినీ వేలానికి ముందు క్యాష్ ట్రేడింగ్ ద్వారా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ తమ జట్టులోకి తెచ్చుకుంది. కెప్టెన్సీ బాధ్యతలను కూడా అప్పగించింది. హార్దిక్ పాండ్యాను జట్టులోకి తెచ్చుకునేందుకు ఫ్రాంచైజీతో పాటు అతనికి భారీగా డబ్బులు ఇచ్చినట్లు కూడా ప్రచారం జరిగింది.
గాయం కారణంగా అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు దేశవాళీ క్రికెట్‌కు దూరంగా ఉన్న హార్దిక్ పాండ్యా.. ఐపీఎల్ 2024 సీజన్‌తో మైదానంలోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. అయితే ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ ప్రవీణ్ కుమార్ విమర్శలు గుప్పించాడు.

'ఐపీఎల్‌కు రెండు నెలల ముందు గాయపడ్డాడు. అప్పటి నుంచి దేశం తరఫున ఆడలేదు. దేశవాళీ క్రికెట్‌తో తన సొంత రాష్ట్రానికి ప్రాతినిథ్యం ఇవ్వలేదు. కానీ నేరుగా ఐపీఎల్ ఆడేందుకు మాత్రం సిద్దమయ్యాడు. అలా ఎలా సాధ్యమవుతుందో..? డబ్బులు సంపాదించడంలో తప్పులేదు. కానీ రాష్ట్రంతో పాటు దేశం తరఫున ఆడాలి కదా..? ప్రస్తుత ఆటగాళ్లు ఐపీఎల్‌కు మాత్రమే ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
ముంబై ఇండియన్స్‌ను నడిపించే సత్తా రోహిత్ శర్మకు ఉంది. ఈ ఏడాదే కాదు.. మరో రెండేళ్ల పాటు అతను ముంబైకి సారథ్యం వహించగలడు. కానీ కెప్టెన్సీ మార్పు అనేది ఫ్రాంచైజీ మేనేజ్‌మెంట్ చేతుల్లో ఉండే విషయం.'అని ప్రవీణ్ కుమార్ చెప్పుకొచ్చాడు.
మార్చి 22 నుంచి ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభం కానుండగా.. మార్చి 24న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్ ఆడనున్నాయి. ఇప్పటికే ప్రీ ట్రైనింగ్ క్యాంప్‌ను ఇరు జట్లు ప్రారంభించాయి. హార్దిక్ పాండ్యా సైతం ఈ ప్రాక్టీస్ క్యాంప్‌లో పాల్గొని శ్రమిస్తున్నాడు.