ఐపీఎల్ 2024 సీజన్ ప్లే ఆఫ్స్ సమరం రసవత్తరంగా మారింది. ఇప్పటికే ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకోగా.. తాజాగా గుజరాత్ టైటాన్స్ ఆ జాబితాలో చేరింది. సోమవారం జరగాల్సిన కేకేఆర్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయ్యింది.
దాంతో అంపైర్లు ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. 19 పాయింట్లతో కోల్‌కతా నైట్‌రైడర్స్ తమ అగ్రస్థానాన్ని పదిలం చేసుకోవడంతో పాటు టాప్-2 బెర్త్‌ను ఖరారు చేసుకుంది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే తమ చివరి మ్యాచ్‌లో ఓడినా.. కేకేఆర్ రెండో స్థానంలో నిలుస్తోంది. ఇప్పటికే 63 మ్యాచ్‌లు ముగియగా.. కేకేఆర్ మినహా మరే జట్టు అధికారికంగా ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకోలేదు.

16 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్‌కు దాదాపు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు కాగా.. మరో రెండు స్థానాల కోసం చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడుతున్నాయి.
ఓడితే ఇంటికే..
నేడు ఢిల్లీ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. ఇరు జట్లు చెరో 12 పాయింట్లతో ఉన్నాయి. ఢిల్లీకి ఇదే ఆఖరి లీగ్ మ్యాచ్ కాగా.. లక్నో సూపర్ జెయింట్స్‌కు ముంబై ఇండియన్స్‌తో మరో మ్యాచ్ మిగిలి ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఘోర పరాజయం తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ రన్‌రేట్ దారుణంగా పడిపోయింది.
ఆ జట్టు ప్లే ఆఫ్స్ చేరాలంటే ఢిల్లీ, ముంబైలను ఓడించాలి. అంతేకాకుండా సన్‌రైజర్స్, సీఎస్‌కే తమ తదుపరి మ్యాచ్‌ల్లో ఓడిపోవాలి. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ ఈ మ్యాచ్ గెలిచినా ప్లే ఆఫ్స్ చేరలేని పరిస్థితి. గత మ్యాచ్‌లో ఆర్‌సీబీతో ఆ జట్టు 47 పరుగుల తేడాతో ఓటమిపాలవ్వడంతో రన్‌రేట్ పడిపోయింది. లక్నోతో గెలిచినా.. సీఎస్‌కే, ఆర్‌సీబీ కంటే మెరుగైన రన్‌రేట్ సాధించలేదు.
ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ చేరాలంటే..
0.387 రన్‌రేట్‌తో ఆర్‌సీబీ ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఆ జట్టు తమ చివరి లీగ్ మ్యాచ్‌ను బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఆర్‌సీబీ 18 ప్లస్ రన్స్ తేడాతో ఓడించాలి. లేదా 18.1 ఓవర్లలోనే సీఎస్‌కే విధించిన లక్ష్యాన్ని చేధించాలి.
అప్పుడే సీఎస్‌కే కంటే మెరుగైన రన్‌రేట్ సాధించి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తోంది. అంతేకాకుండా సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ తమ చివరి రెండు మ్యాచ్‌ల్లో కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఓడాలి.
డేంజర్ జోన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్..
14 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. తమ చివరి రెండు మ్యాచ్‌ల్లో కనీసం ఒక్క మ్యాచ్ అయినా మెరుగైన రన్‌రేట్‌తో గెలవడం కీలకం. ఈ రెండు మ్యాచ్‌ల్లో ఓడితే మాత్రం సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంటుంది.
సన్‌రైజర్స్ తమ చివరి రెండు మ్యాచ్‌ల్లో గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ ఓడి.. లక్నో సూపర్ జెయింట్స్ ఒక్క మ్యాచ్‌లో ఓడినా ఆర్‌సీబీ, సీఎస్‌కే ప్లే ఆఫ్స్ చేరుతాయి.