ఐపీఎల్ 2024 సీజన్ కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే 54 గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు ముగిసాయి. లీగ్ దశలో మరో 16 మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పటికీ ఒక్క జట్టు కూడా అధికారికంగా ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకోలేదు. అనూహ్యంగా పుంజుకున్న ఆర్‌సీబీ కూడా పోటీలో నిలిచింది. కానీ ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ మాత్రం అందరి కన్నా ముందు ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది.
ఇక ప్లే ఆఫ్స్ నాలుగు బెర్త్‌ల కోసం మొత్తం 9 జట్లు పోటీ పడుతున్నాయి. టోర్నీలో ఇంకా 16 మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ 16 మ్యాచ్‌లే 9 జట్ల భవితవ్యాలను తేల్చనున్నాయి. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‌లో కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్, సీఎస్‌కే, సన్‌రైజర్స్ హైదరాబాద్ టాప్-4 కొనసాగుతున్నాయి.

ఈ నాలుగు జట్లలో కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ దాదాపు ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నట్లే. ఈ రెండు జట్లు మరో విజయం సాధిస్తే.. అధికారికంగా ప్లే ఆఫ్స్ బెర్త్‌ను అందుకుంటాయి. రాజస్థాన్ రాయల్స్.. ఇంకా నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సింది. ఇందులో ఒక్కటి గెలిచినా.. ఎలాంటి సమీకరణం లేకుండా ప్లే ఆఫ్స్ బెర్త్‌ను దక్కించుకుంది.

రాజస్థాన్ రాయల్స్ ఢిల్లీ, చెన్నై, పంజాబ్, కేకేఆర్‌తో తలపడాల్సి ఉంది. కేకేఆర్ మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో ఒక్కటి గెలిచినా మరే జట్టుతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్స్ చేరనుంది.

సీఎస్‌కే, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పాటు ఐదో స్థానంలో కొనసాగుతున్న లక్నో సూపర్ జెయింట్స్ మరో రెండు మ్యాచ్‌లు గెలవాల్సి ఉంది. విజయం సాధించడమే కాకుండా మెరుగైన రన్‌రేట్ సాధించాల్సి ఉంది. ఆరో స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ టోర్నీలో మిగిలిన మూడు మ్యాచ్‌లకు మూడు గెలవాల్సి ఉంది.

అద్భుతం జరిగితే తప్పా ఆర్‌సీబీ, పంజాబ్ కింగ్స్‌కు ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలు లేవు. టాప్-6లో ఉన్న జట్లు మిగతా మ్యాచ్‌ల్లో ఓడి వెనుకంజలో నిలిస్తేనే.. ఆర్‌సీబీ, పీబీకేఎస్ రేసులో నిలుస్తాయి. అయితే ఆ జట్లు టోర్నీలో మిగిలిన మూడు మ్యాచ్‌లకు మూడు గెలవాల్సి ఉంటుంది.