ఎప్పుడెప్పుడా? అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2024 సీజన్‌కు రంగం సిద్దమైంది. మరికొద్ది క్షణాల్లో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. చెన్నైలోని చెపాక్ మైదానం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) తొలి మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఓవైపు యావత్ దేశం ఐపీఎల్ మత్తులో మునిగి తేలుతుండగా.. మరోవైపు మాజీ క్రికెటర్లు తమ అంచనాలను వెల్లడిస్తూ మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు.
అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ షోలో పాల్గొన్న ఇర్ఫాన్ పఠాన్.. ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్ చేరే జట్లను అంచనా వేసాడు. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్‌తో పాటు కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు ప్లే ఆఫ్స్ చేరుతాయని తెలిపాడు. ఇక ఆర్‌సీబీ, సన్‌రైజర్స్ హైదరాబాద్ పేర్లు ఇందులో లేకపోవడంతో ఆ ఫ్రాంచైజీల అభిమానులు బాధపడుతున్నారు.

'ప్రస్తుతం పేపర్‌పై ఆయా జట్ల బలాలు, బలహీనతలను చూస్తుంటే ఆ నాలుగు జట్లు ప్లే ఆఫ్స్ చేరుతాయనిపిస్తోంది. ముంబై ఇండియన్స్ చాలా బలంగా ఉంది. చెన్నై సూపర్ కింగ్స్‌కు ఎన్ని ఇబ్బందులున్నా ఆ జట్టు ముందడుగు వేస్తోంది. డేవాన్ కాన్వే, దీపక్ చాహర్ గాయాలతో బాధపడుతున్నా.. ధోనీ చరిష్మాతో ముందుకు సాగుతోంది.
ధోనీ తన అనుభవంతో జట్టును ముందుకు తీసుకెళ్తాడు. లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ చాలా నిలకడగా ఉంది. పేపర్‌పై చాలా బలంగా కనిపిస్తోంది. కేకేఆర్ కూడా బలంగానే ఉంది. ఈ నాలుగు జట్లే ప్లే ఆఫ్స్ చేరుతాయని అనుకుంటున్నా. 'అని ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు.
ఇతర మాజీ క్రికెటర్లు సైతం తమ అంచనాలను వెల్లడించారు. చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ప్లేయర్ అంబటి రాయుడు సీఎస్‌కే, కేకేఆర్, ఆర్‌సీబీ, ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ చేరుతాయని చెప్పాడు. స్టీవ్ స్మిత్ మాత్రం ముంబై, లక్నో, ఢిల్లీ, సీఎస్‌కేకు అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. డేల్ స్టెయిన్ మాత్రం సన్‌రైజర్స్, సీఎస్‌కే, ముంబై ఇండియన్స్ పేర్లు సూచించాడు. ప్రస్తుతం వీరి అంచనాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యాయి.