ఐపీఎల్ 2024 సీజన్‌లో సంచలన ప్రదర్శనతో ఫైనల్‌కు దూసుకొచ్చిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. అసలు పోరులో మాత్రం తేలిపోయింది. కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్)తో ఆదివారం చెపాక్ వేదికగా ఏకపక్షంగా సాగిన ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో చిత్తయ్యింది. దాంతో టైటిల్ గెలిచే సువర్ణవకాశాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ చేజార్చుకుంది.
జట్టు ప్రధాన బలమైన టాపార్డ్ బ్యాటర్ల వైఫల్యమే సన్‌రైజర్స్ హైదరాబాద్ పతనాన్ని శాసించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 18.3 ఓవర్లలో 113 పరుగులకు కుప్పకూలింది. ఎయిడెన్ మార్క్‌రమ్(23 బంతుల్లో 3 ఫోర్లతో 20), ప్యాట్ కమిన్స్(19 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 24) టాప్ స్కోరర్లుగా నిలిచారు. కేకేఆర్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా రెండేసి వికెట్లు తీయగా.. ఆండ్రీ రస్సెల్(3/19) మూడు వికెట్లు పడగొట్టాడు. వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తీ, సునీల్ నరైన్ తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన కేకేఆర్ 10.3 ఓవర్లలో 2 వికెట్లకు 114 పరుగులు చేసి 57 బంతులు మిగిలి ఉండగానే సునాయస విజయాన్నందుకుంది. సునీల్ నరైన్(6) విఫలమైనా.. రెహ్మానుల్లా గుర్బాజ్(32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39), వెంకటేశ్ అయ్యర్(26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 52 నాటౌట్) సత్తా చాటారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో ప్యాట్ కమిన్స్, షెహ్‌బాజ్ అహ్మద్ తలో వికెట్ తీసారు.
నితీష్ రెడ్డికి జాక్‌పాట్..
ఈ మ్యాచ్‌లో ఓడినా సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ ప్లేయర్, తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డికి జాక్‌పాట్ ప్రైజ్‌మనీ దక్కింది. ఈ సీజన్‌లో సంచలన ప్రదర్శనతో అందర్నీ ఆకర్షించిన నితీష్ కుమార్ రెడ్డికి ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డు దక్కింది.
ఈ అవార్డుతో పాటు రూ. 10 లక్షల క్యాష్ రివార్డ్‌ను కూడా బీసీసీఐ నిర్వాహకులు నితీష్ కుమార్ రెడ్డికి అందజేశారు. రూ. 20 లక్షల కనీస ధరతో సన్‌రైజర్స్ జట్టులోకి వచ్చిన నితీష్ కుమార్ రెడ్డికి.. ఈ రూ. 10 లక్షల ప్రోత్సాహకం ఎంతగానో ఉపయోగపడనుంది. ఇటీవలే జరిగిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్(ఏపీఎల్)2025 వేలంలోనూ నితీష్ కుమార్ రెడ్డి రూ. 15 లక్షల భారీ ధర పలికాడు.
వచ్చే ఏడాది కోట్లలోనే..
ఇదే తరహా ప్రదర్శనను వచ్చే ఏడాది కొనసాగిస్తే ఐపీఎల్ 2025 మెగా వేలంలో నితీష్ కుమార్ రెడ్డి కోట్లు పలికే ఛాన్స్ ఉంది. ఈ సీజన్‌లో మొత్తం 13 మ్యాచ్‌లు ఆడిన నితీష్ కుమార్ రెడ్డి 33.67 సగటుతో 303 పరుగులు చేశాడు. 142.92 స్ట్రైక్‌రేట్‌తో రెండు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో కీలక బ్యాటర్లంతా విఫలమైన వేళ నితీష్ కుమార్ రెడ్డి(76 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. బౌలింగ్‌లో 3 వికెట్లు తీసాడు.