సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ సంచలనం నితీష్ కుమార్ రెడ్డికి జాక్‌పాట్ ధర దక్కింది. గురువారం జరిగిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్(ఏపీఎల్) సీజన్-3కి సంబంధించిన వేలంలో నితీష్ కుమార్ రెడ్డి రూ. 15.6 లక్షల భారీ ధర పలికాడు. దాంతో ఈ లీగ్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు. 20 ఏళ్ల ఈ యువ ఆల్‌రౌండర్‌ను గోదావరి టైటాన్స్ దక్కించుకుంది.
ఐపీఎల్ 2023 వేలంలో అతన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 20 లక్షల కనీస ధర కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2023 సీజన్‌లో నితీష్ కుమార్ రెడ్డికి ఎక్కువ అవకాశాలు రాకున్నా.. తాజా సీజన్‌లో సంచలన ప్రదర్శన కనబర్చాడు. దాంతో అతను రెగ్యులర్ ఆటగాడిగా జట్టులో కొనసాగుతున్నాడు.

ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన నితీష్ కుమార్ రెడ్డి 239 పరుగులతో పాటు మూడు వికెట్లు తీసాడు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ వేలాన్ని హోటల్ రూమ్‌లో నుంచి తన ట్యాబ్‌లో వీక్షించిన నితీష్ కుమార్ రెడ్డి.. భారీ ధర పలకడంపై సంతోషం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ దిగ్విజయంగా రెండు సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ టోర్నీలో మొత్తం 6 జట్లు పోటీపడుతాయి. బెజవాడ టైగర్స్, ఉత్తరాంధ్ర లయన్స్, గోదావరి టైటాన్స్, రాయలసీమ కింగ్స్, వైజాగ్ వారియర్స్, కోస్టల్ రైడర్స్ పేరిట ఆరు జట్లు బరిలోకి దిగుతాయి. ప్రతిభ కలిగిన స్థానిక ఆటగాళ్లను వెలుగులోకి తీసుకురావడమే ఈ టోర్నీ ముఖ్య ఉద్దేశమని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గోపినాథ్ రెడ్డి తెలిపారు.