చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌ను తాను విమర్శిస్తున్నట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని ఆ జట్టు మాజీ క్రికెటర్, తెలుగు తేజం అంబటి రాయుడు స్పష్టం చేశాడు. తాను ఎక్కడా? కూడా రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీని విమర్శించలేదని ఎక్స్‌వేదికగా పేర్కొన్నాడు.
తాను అనని మాటలు అన్నట్లు రాసిన వెబ్‌సైట్ కథనాలపై రాయుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమిపాలైంది.
అయితే ఈ ఓటమికి రుతురాజ్ గైక్వాడ్ చెత్త కెప్టెన్సీనే ప్రధాన కారణమని రాయుడు అన్నట్లు పలు నేషనల్ వెబ్‌సైట్స్ కథనాలు రాసాయి. రాయుడి వ్యాఖ్యలను భారత మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్దు తప్పుబట్టినట్లు కూడా పేర్కొన్నాయి.
కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ అనుభవరాహిత్యమే చెన్నై సూపర్ కింగ్స్ ఓటమికి ప్రధాన కారణమని రాయుడు అన్నట్లు తెలిపాయి. అయితే ఈ వార్త కథనాలపై రాయుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. రుతురాజ్ గైక్వాడ్‌పై ఎలాంటి విమర్శలు చేయలేదని ఎక్స్‌వేదికగా వెల్లడించాడు.
'ఆ రోజు నేను కామెంట్రీ కూడా చెప్పలేదు. మా ఫామ్‌లో మామిడి పండ్లు కోసాను. మీకు ఈ న్యూస్ ఎలా వచ్చింది? మీకు మీరే ఊహించుకొని రాస్తారా?'అని రాయుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు.

సీఎస్‌కే గెలిచినప్పుడు ధోనీని ప్రశంసించి ఓడినప్పుడు రుతురాజ్ గైక్వాడ్‌ను విమర్శించడం సరికాదని నవ్‌జ్యోత్ సింగ్ సిద్దు అన్నాడు. 'సీఎస్‌కే విజయాల క్రెడిట్ ధోనీకి ఇచ్చినప్పుడు ఓటములకు కూడా అతన్నే నిందించాలి. ధోనీ ఇప్పటికే సీఎస్‌కే టీమ్ వ్యూహకర్తనే.
రుతురాజ్ గైక్వాడ్ ఇప్పటికీ ధోనీ నీడలోనే ఉన్నాడు. ధోనీ కెప్టెన్ కాదని పైకి చెబుతున్నా.. అతనే జట్టును నడిపిస్తున్నాడు. జట్టులో నుంచి ధోనీ తప్పుకునే వరకు ఈ పరిస్థితే కొనసాగుతోంది.'అని సిక్సర్ల సిద్దు చెప్పుకొచ్చాడు.
రుతురాజ్ శతకం వృథా..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 210 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్(60 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌లతో 108 నాటౌట్) విధ్వంసకర శతకంతో చెలరేగగా.. శివమ్ దూబే(27 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 66) అజేయ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.
లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ, మోహ్‌సిన్ ఖాన్, యశ్ ఠాకూర్ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ 19.3 ఓవర్లలో 4 వికెట్లకే 213 పరుగులు చేసి గెలుపొందింది.