ఆరంభంలో ఇబ్బంది పడటం.. మధ్యలో పుంజుకోవడం.. చివర్లో చెలరేగి ఆడడం... ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ శైలి ఇది. ఆటలోనే కాదు టైటిల్స్ నెగ్గడంలోనూ ఆ జట్టు తీరు అదే. తొలి ఐదు సీజన్లలో ఒకేసారి ఫైనల్ వరకూ వచ్చిన ముంబై.. తర్వాతి ఏనిమిది సీజన్లలో ఏకంగా ఐదు టైటిల్స్ నెగ్గింది. ఈ ఐదు ట్రోఫీలు రోహిత్ శర్మ సారథ్యంలోనే రావడం విశేషం.
అయితే ఐపీఎల్ 2022 మెగా ఆక్షన్ తర్వాత ముంబై ఆధిపత్యానికి బ్రేక్ పడింది. స్ట్రాంగ్ కోర్ టీమ్ కలిగిన ముంబై టీమ్ మెగా ఆక్షన్ కారణంగా చిన్నాభిన్నమైంది. దాంతో గత మూడు సీజన్లలో ముంబై దారుణంగా విఫలమైంది. ఐపీఎల్ 2022 సీజన్‌లో అయితే పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు స్థానంలో నిలిచింది. గతేడాది పర్వాలేదనిపించినా.. ఫైనల్ చేరలేకపోయింది.

పేపర్‌పై భీకరంగా..
ఐపీఎల్ 2023 మినీ వేలానికి ముందు స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను ప్లేయర్ ట్రేడింగ్ విండో ద్వారా జట్టులోకి తెచ్చుకున్న ముంబై ఇండియన్స్.. అతనికే సారథ్య బాధ్యతలను అప్పగించింది. అంతేకాకుండా మినీ వేలంలో 8 మంది కత్తిలాంటి ఆటగాళ్లను కొనుగోలు చేసింది. జట్టుకు భారంగా మారిన జోఫ్రా ఆర్చర్ వదిలేసిన ముంబై సౌతాఫ్రికా యువ సంచలనం గెరాల్డ్ కోయిట్జీ(రూ. 5 కోట్లు)ని తక్కువ ధరకే కొనుగోలు చేసింది.
అలాగే మరో ఓవర్‌సీస్ పేసర్ స్లాట్‌ను భర్తీ చేసేందుకు జూనియర్ మలింగగా గుర్తింపు పొందిన శ్రీలంక బౌలర్ నువాన్ తుషార్(రూ.4.8 కోట్లు)ను తీసుకుంది. స్పిన్ ఆల్‌రౌండర్ కోటాలో అఫ్గానిస్థాన్ స్పిన్ ఆల్‌రౌండర్ మహమ్మద్ నబీని(రూ.1.50 కోట్లు) తీసుకుంది. పేపర్‌పై ముంబై ఇండియన్స్ చాలా బలంగా కనిపిస్తోంది.
బలమైన టీమ్, కెప్టెన్, గొప్ప సహాయక సిబ్బందితో హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. మరి, ఆ జట్టు మరోసారి ఛాంపియన్‌గా నిలిస్తుందో లేదో చూడాలి. ఓసారి ఆ జట్టు బలలాలు, బలహీనతలపై లుక్కెద్దాం.
ముంబై ఇండియన్స్ బలాలు..
జస్‌ప్రీత్ బుమ్రా, నువాన్ తుషార్, గెరాల్డ్ కోయిట్జీ, మధుషంకలతో ముంబై పేస్ విభాగం భీకరంగా ఉంది. ముఖ్యంగా బుమ్రా సూపర్ ఫామ్‌లో ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. వెన్నుగాయంతో గత సీజన్‌లో అతను దారుణంగా విఫలమవ్వడం ముంబైకి నష్టం చేసింది. కానీ ప్రస్తుతం అతను మునపటిలా సత్తా చాటుతున్నాడు. కోయిట్జీ, మధుషంకలు సైతం భారత్ వన్డే ప్రపంచకప్‌లో దుమ్మురేపారు. యువ పేసర్ ఆకాశ్ మధ్వాల్ కూడా సత్తా చాటుతున్నాడు. వీరికి తోడుగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా బౌలింగ్ చేయనున్నాడు.
రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, టీమ్ డేవిడ్, తిలక్ వర్మలతో ముంబై బ్యాటింగ్ భీకరంగా ఉంది. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న రోహిత్ మరింత స్వేచ్చగా ఆడే అవకాశం ఉంది. రోహిత్, ఇషాన్ కిషన్ మెరుపు ఆరంభాలు ఇవ్వనుండగా.. సూర్య, హార్దిక్, తిలక్ మిడిలార్డర్ బాధ్యతలు మోయనున్నారు. టీమ్ డేవిడ్ తనదైనశైలిలో మ్యాచ్‌లను ముగించనున్నాడు.

బలహీనతలు..
బ్యాటింగ్‌తో పాటు పేస్ బౌలింగ్ భీకరంగా ఉన్నా.. వికెట్ టేకింగ్ స్పిన్నర్ లేకపోవడం ముంబై ఇండియన్స్‌కు ప్రధాన సమస్యగా మారింది. గత సీజన్‌లోనూ ముంబై ఇదే సమస్యతో ఇబ్బంది పడింది. పియూష్ చావ్లా ఒక్కడే సత్తా చాటగా.. అతనికి తోడుగా కుమార్ కార్తీకేయ, హృతిక్ షోకీన్ రాణించలేకపోయారు. దాంతో మినీవేలంలో ముంబై మహమ్మద్ నబీతో పాటు శ్రేయాస్ గోపాల్‌ను తీసుకుంది. కానీ వారు కూడా వికెట్ టేకింగ్ స్పిన్నర్లు అయితే కాదు. ఇదొక్కడే ముంబైకి పెద్ద సమస్యగా మారింది.
ఇక కెప్టెన్సీ మార్పు కూడా ముంబై ఇండియన్స్‌కు చేటు చేసే అవకాశం ఉంది. హార్దిక్ పాండ్యాకు సారథ్యం ఇవ్వడంపై రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దాంతో హార్దిక్ సారథ్యంలో వారు ఏ మేరకు రాణిస్తారనేది కూడా మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇప్పటికే రోహిత్ శర్మ అభిమానులు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీపై దుమ్మెత్తిపోస్తున్నారు.
ముంబై ఇండియన్స్ తుది జట్టు (అంచనా)
రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, టీమ్ డేవిడ్, హార్దిక్ పాండ్యా, రోమారియో షెఫెర్డ్, గెరాల్డ్ కోయిట్జీ, జస్‌ప్రీత్ బుమ్రా,శ్రేయస్ గోపాల్, పియూష్ చావ్లా
ముంబై ఇండియన్స్ పూర్తి జట్టు:
గెరాల్డ్ కోయిట్జీ, దిల్షాన్ మధుషంక, శ్రేయస్ గోపాల్, నువాన్ తుషార్, నమాన్ ధిర్, అన్షుల్ కంబోజ్, మహమ్మద్ నబీ, శివాలిక్ శర్మ, రోహిత్ శర్మ, డెవాల్డ్ బ్రేవిస్,సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, టీమ్ డేవిడ్, విష్ణు వినోద్, అర్జున్ టెండూల్కర్, శామ్స్ ములాని, నేహాల్ వధేరా, జస్‌ప్రీత్ బుమ్రా, కుమార్ కార్తీకేయ, పియూష్ చావ్లా, ఆకాశ్ మధ్వాల్, జాసన్ బెహ్రెండార్ఫ్, రోమారియో షెఫర్డ్(ట్రేడింగ్), హార్దిక్ పాండ్యా(ట్రేడింగ్).