ఐపీఎల్ 2024 సీజన్‌లో బోణీ చేసిన ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో వాంఖడే వేదికగా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో 29 పరుగుల తేడాతో గెలిచిన ముంబై ఇండియన్స్‌కు టీ20 క్రికెట్‌లో 150వ విజయం. ఈ ఫీట్ సాధించిన తొలి టీమ్‌గా ముంబై ఇండియన్స్ చరిత్రకెక్కింది.
ఈ జాబితాలో ముంబై ఇండియన్స్(150) తర్వాత చెన్నై సూపర్ కింగ్స్(148), భారత్(144), లంకషైర్(143), నాటింగ్‌హమ్‌షైర్(143) ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌పై అసాధారణ విజయాన్ని అందుకున్న ముంబై ఇండియన్స్ పలు రికార్డులను తమ పేరిట లిఖించుకుంది.

ఒక్కడు హాఫ్ సెంచరీ చేయకుండా..
టీ20 క్రికెట్ చరిత్రలోనే ఒక్క ఆటగాడు కూడా హాఫ్ సెంచరీ చేయకుండా 234 పరుగుల భారీ స్కోర్ చేసిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ టీ20 బ్లాస్ట్ టోర్నీ టీమ్ సోమర్‌సెట్ రికార్డును అధిగమించింది.
2018లో ఆ జట్టు ఒక్క బ్యాటర్ హాఫ్ సెంచరీ చేయకుండా 226 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ జాబితాలో ముంబై ఇండియన్స్(234/5) తర్వాత సోమర్‌సెట్(226/5), ఐర్లాండ్ ఏ(222/5), ఆస్ట్రేలియా(221/5), సెంట్రల్ డిస్ట్రిక్ట్(221/5) జట్లు ఉన్నాయి.
ముంబై @150
ఐపీఎల్‌లో ఒకే వేదికగా అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన జట్టుగానూ ముంబై ఇండియన్స్ నిలిచింది. వాంఖడే వేదికగా ఆ జట్టు 50 విజయాలు నమోదు చేసింది. ముంబై తర్వాత ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్ 48 విజయాలు అందుకుంది. సీఎస్‌కే చెపాక్ వేదికగా 47, ఆర్‌సీబీ బెంగళూరువేదికగా 41, రాజస్థాన్ జైపూర్ వేదికగా 36 విజయాలు నమోదు చేశాయి.

ఓటమెరుగని ముంబై..
ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ 14 సార్లు 200 ప్లస్ రన్స్‌ను కాపాడుకుంది. 200 ప్లస్ రన్స్ చేసిన తర్వాత ఆ జట్టు ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 234 పరుగుల భారీ స్కోర్ చేసింది. రోమారియో షెఫర్డ్ (10 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 39 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు.
అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 205 పరుగులే చేసి ఓటమిపాలైంది. పృథ్వీ షా(40 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 66), ట్రిస్టన్ స్టబ్స్(25 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 71 నాటౌట్) రాణించినా ఫలితం లేకపోయింది.