ఐపీఎల్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్ అయిన ముంబై ఇండియన్స్ అత్యంత ఖరీదైన జట్టుగా నిలిచింది. పది ఫ్రాంచైజీల్లో అత్యధిక బ్రాండ్ వాల్యూ కలిగిన టీమ్‌గా గుర్తింపు పొందింది. 'బ్రాండ్ ఫైనాన్స్'అనే సంస్థ వివరాల ప్రకారం ముంబై ఇండియన్స్ విలువ రూ. 725.36 కోట్లు (87 మిలియన్ల అమెరికా డాలర్లు). ఈ జాబితాలో ముంబై టాప్‌లో ఉండగా.. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ రెండో స్థానంలో ఉంది.
చెన్నై సూపర్ కింగ్స్ బ్రాండ్ వాల్యూ 80.6 మిలియన్ డాలర్లుకాగా.. కోల్‌కతా నైట్‌రైడర్స్(78.6 మిలియన్ డాలర్లు) మూడో స్థానంలో నిలిచింది. ఆశ్చర్యకరంగా అత్యధిక ఫ్యాన్స్ కలిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) 69.8 మిలియన్ డాలర్లతో నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది.

రెండేళ్ల క్రితమే ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ 65.4 మిలియన్ డాలర్లతో ఐదో స్థానంలో నిలవగా.. ఢిల్లీ క్యాపిటల్స్ 64.1 మిలియన్ డాటర్లతో ఆరో స్థానంలో నిలిచింది. రాజస్థాన్ రాయల్స్(62.5 మిలియన్ డాలర్లు), సన్‌రైజర్స్ హైదరాబాద్(48.2 మిలియన్ డాలర్లు), లక్నో సూపర్ జెయింట్స్(47 మిలియన్ డాలర్లు), పంజాబ్ కింగ్స్(45.3 మిలియన్ డాలర్లు) చివరి నాలుగు స్థానాల్లో ఉన్నాయి.
ఇక వరల్డ్ బెస్ట్ క్రికెట్ లీగ్ అయిన ఐపీఎల్ వాల్యూ 10.7 బిలియన్ డాలర్లకు చేరింది. ఒక్క ఏడాదికే ఐపీఎల్ వాల్యూ 28 శాతం పెరిగింది. ఐపీఎల్ 2022 సీజన్‌లో ఈ లీగ్ బ్రాండ్ వాల్యూ 8.4 బిలియన్ డాలర్లుగా ఉంది.
15 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ చెరో ఐదు సార్లు టైటిల్ గెలవగా.. కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్(డెక్కన్ చార్జర్స్ 2009) రెండేసి సార్లు ఛాంపియన్‌గా నిలిచాయి. గుజరాత్ టైటాన్స్ అరంగేట్ర సీజన్‌లోనే టైటిల్ అందుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌లకు ఐపీఎల్ టైటిల్ అందని ద్రాక్షగా మిగిలింది.
ఐపీఎల్ 2024 సీజన్ నిర్వహణకు సంబంధించిన కసరత్తు ప్రారంభించిన బీసీసీఐ.. డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా అప్‌కమింగ్ సీజన్‌కు సంబంధించిన వేలాన్ని నిర్వహిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. రిటెన్షన్ ప్రక్రియను కూడా పూర్తి చేసింది. పది ఫ్రాంచైజీలకు తమకు కావాల్సిన ఆటగాళ్లను రిటైన్ చేసుకొని అనవసరమైన ఆటగాళ్లను వదులుకున్నాయి. వేలంలో టీమ్‌కాంబినేషన్‌కు కావాల్సిన ఆటగాళ్లను తీసుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి.