ఐపీఎల్ 2024 సీజన్ ఫైనల్లో సత్తా చాటడంపై కోల్‌కతా నైట్‌రైడర్స్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ సంతోషం వ్యక్తం చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆదివారం జరిగిన ఫైనల్లో మిచెల్ స్టార్క్ రెండు వికెట్లతో సత్తా చాటి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. రూ.24.75 కోట్ల భారీ దరకు స్టార్క్‌ను కేకేఆర్ కొనుగోలు చేయగా.. అతను లీగ్ దశలో దారుణంగా విఫలమయ్యాడు.
12 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు మాత్రమే తీసిన అతను కీలక నాకౌట్ మ్యాచ్‌ల్లో మాత్రం 5 వికెట్లతో కేకేఆర్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. క్వాలిఫయర్-1లో మూడు వికెట్లు తీసి సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను దెబ్బతీసిన స్టార్క్.. ఫైనల్లోనూ అదే జోరు కనబర్చాడు.

ఈ విజయానంతరం తన ప్రదర్శనపై మాట్లాడిన స్టార్క్.. ఒక ఫార్మాట్ నుంచి తప్పుకుంటానని తెలిపాడు. అయితే ఈ సీజన్‌లో తన పారితోషకంపై చాలా ట్రోల్స్ వచ్చాయన్నాడు. 'కేకేఆర్‌కు ఇదో అద్భుతమైన సీజన్. ఫైనల్లో రెండు అత్యుత్తమ జట్లు పోటీపడ్డాయి. టోర్నీ ఆరంభం నుంచే ప్రతీ మ్యాచ్‌లో సత్తా చాటాం.
అత్యుత్తమ బ్యాటర్లు, బౌలర్లతో కూడిన జట్టు మాది. జట్టులోని ప్రతీ ఒక్కరు సత్తా చాటారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడినా.. బౌలింగ్ చేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాం. రెండు రోజుల కిందట ఇదే పిచ్‌పై జరిగిన మ్యాచ్‌ను చూశాం. పిచ్ ఎలా ఉందో అర్థం చేసుకున్నాం. అయితే, మ్యాచ్ పరిస్థితులకు త్వరగా అలవాటు పడాలని నిర్ణయించుకున్నాం.
మాకు శ్రేయస్ అయ్యర్ రూపంలో అద్భుతమైన కెప్టెన్ ఉన్నాడు. బౌలర్లను, ఫీల్డర్లను ఎలా వాడుకోవాలో బాగా తెలిసిన వ్యక్తి. టోర్నీ ప్రారంభానికి ముందు నా ప్రైజ్‌మనీపై చాలా జోకులు వచ్చాయి. నేను ఐపీఎల్‌లో చాలా రోజుల తర్వాత రీఎంట్రీ ఇచ్చాను. మా జట్టు విజయంలో ప్రతీ ఆటగాడితో పాటు సపోర్ట్ స్టాఫ్ పాత్ర ఉంది.
నా కెరీర్ చివరి దశకు చేరింది. భవిష్యత్తులో ఒక ఫార్మాట్ ఆడకపోవచ్చు. ఇక నుంచి టీ20లు, ఫ్రాంచైజీ క్రికెట్‌కు మాత్రమే ప్రాధాన్యత ఇస్తాను. వచ్చే ఏడాది కేకేఆర్ తరఫునే బరిలోకి దిగాలనుకుంటున్నా'అని స్టార్క్ చెప్పుకొచ్చాడు.