హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్‌లోనూ లక్నో సూపర్ జెయింట్స్ విఫలమైంది. గతేడాదే టోర్నీలోకి అడుగుపెట్టిన లక్నో సూపర్ జెయింట్స్ అద్బుత ప్రదర్శనతో ప్లే ఆఫ్స్ చేరినా.. ఆర్‌సీబీతో ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓడి టైటిల్ అందుకోలేకపోయింది. ఈ సారి కూడా ఎలిమినేటర్ మ్యాచ్‌లోనే ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమిపాలైంది.
కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో పాటు కీలక ఆటగాళ్లు గాయాలతో జట్టుకు దూరమవడం.. యువ ఆటగాళ్ల వైఫల్యం.. కీలక సమయంలో స్టార్ ఆటగాళ్లు ఫామ్ కోల్పోవడం లక్నో సూపర్ జెయింట్స్ విజయవకాశాలను దెబ్బతీసింది. 14 మ్యాచ్‌ల్లో 8 గెలిచిన లక్నో మూడో స్థానంలో నిలిచింది. ఈ సీజన్ వైఫల్యం నేపథ్యంలో జట్టును పటిష్టం చేయడంపై లక్నో ఫోకస్ పెట్టింది.

ఈ ఏడాది డిసెంబర్‌లో జరగనున్న ఐపీఎల్ 2024 మినీ వేలం కోసం కసరత్తులు ప్రారంభించింది. ఇప్పటికే జట్టుకు అవసరం లేని ఆటగాళ్లతో ఓ జాబితాను సిద్దం చేసింది. ఇందులో నుంచి ముగ్గురు భారత ఆటగాళ్లకు గుడ్‌బై చెప్పేందుకు రెడీ అవుతోంది.
1. దీపక్ హుడా..:
దారుణంగా విఫలమైన దీపక్ హుడాకు గుడ్‌బై చెప్పేందుకు లక్నో సిద్దమైంది. ఈ సీజన్‌లో 12 మ్యాచ్‌లు ఆడిన దీపక్ హుడా 7.64 సగటుతో 84 పరుగులు మాత్రమే చేశాడు. ఈ 12 మ్యాచ్‌ల్లో 90 బంతులు మాత్రమే ఆడిన దీపక్ హుడా 3 ఫోర్లు, 2 సిక్స్‌లు బాదాడు. 34 బంతులను డాట్ చేశాడు.
బ్యాటింగ్ ఆర్డర్ మార్చినా అదే వైఫల్యాన్ని కొనసాగించాడు. ఈ పేలవ ఫామ్ నేపథ్యంలోనే అప్‌కమింగ్ సీజన్ వేలానికి ముందు లక్నో సూపర్ జెయింట్స్ దీపక్ హుడాను వదిలేసే అవకాశం ఉంది.
2. అమిత్ మిశ్రా..:
దీపక్ హుడాతో పాటు అంతగా ప్రభావం చూపని సీనియర్ స్పిన్నర్ అమిత్ మిశ్రాపై కూడా వేటు వేసేందుకు లక్నో సూపర్ జెయింట్స్ సిద్దమైంది. ఈ సీజన్‌లో 7 మ్యాచ్‌లు ఆడిన మిశ్రా.. 7 వికెట్లు మాత్రమే తీసాడు. వయసు కూడా పైబడిన నేపథ్యంలో అప్‌కమింగ్ సీజన్ ముందు అతన్ని వదిలేసి యువ స్పిన్నర్‌ను తీసుకోవాలని లక్నో భావిస్తోంది.
3. కరుణ్ నాయర్:
ఐపీఎల్ 2023 సీజన్ ఒక్క మ్యాచ్ కూడా ఆడని కరుణ్ నాయర్‌ను కూడా లక్నో సూపర్ జెయింట్స్ పక్కనపెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం అతను దేశవాళీ క్రికెట్‌లో కూడా రాణించడం లేదు. ఈ క్రమంలోనే అతనికి బదులు యువ ప్లేయర్‌ను ఎంచుకోవాలనుకుంటోంది.