IPL 2024: లక్నో సూపర్ జెయింట్స్‌లోకి వెస్టిండీస్ యువ సంచలనం!
వెస్టిండీస్ యువ సంచలనం షమర్ జోసెఫ్ పంట పండింది. అతనికి వరల్డ్ బెస్ట్ క్రికెట్ లీగ్ ఐపీఎల్ 2024 సీజన్ ఆడే అవకాశం దక్కింది. అది కూడా రూ. 3 కోట్ల భారీ ధరకు లక్నో సూపర్ జెయింట్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ఆస్ట్రేలియా గడ్డపై ఇటీవల ముగిసిన రెండో టెస్ట్‌లో సంచలన బౌలింగ్‌తో వెలుగులోకి వచ్చిన షమర్ జోసెఫ్‌ను ఇంగ్లండ్ పేసర్ మార్క్‌వుడ్‌కు రీప్లేస్‌మెంట్‌గా తీసుకుంటున్నట్లు లక్నో సూపర్ జెయింట్స్ ప్రకటించింది.
అప్‌కమింగ్ సీజన్‌కు దూరంగా ఉండాలని మార్క్‌వుడ్ నిర్ణయించుకోవడంతో లక్నో సూపర్ జెయింట్స్ ఈ మార్పు చేసింది. గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్ట్‌లో షమర్ జోసెఫ్ రెండో ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు తీసి ఆస్ట్రేలియా పతనాన్ని శాసించాడు. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ సందర్భంగా మిచెల్ స్టార్క్ వేసిన యార్కర్‌కు అతని బొటన వేలు విరిగినా.. మ్యాచ్‌లో కొనసాగి సంచలన బౌలింగ్‌తో వెస్టిండీస్‌కు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు.

షమర్ జోసెఫ్ సంచలన ప్రదర్శనతో 30 ఏళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై వెస్టిండీస్ విజయాన్ని అందుకుంది. షమర్ జోసెఫ్ సంచలన ప్రదర్శనపై యావత్ క్రికెట్ ప్రపంచం ప్రశంసల జల్లు కురిపించింది.
గయానా దీవుల్లోని ఓ మారుమూల పల్లెటూరికి చెందిన పేద కుటుంబంలో పుట్టిన షమర్.. యుక్తవయసులో మొద్దులు నరికే పనికివెళ్లాడు. చిన్నవయసులోనే పెళ్లి చేసుకున్న అతను కుటుంబ పోషణ కోసం పట్టణానికి వెళ్లి ఓ నిర్మాణ సంస్థలో రోజువారీ కూలిగా పనిచేశాడు. ఆ తర్వాత సెక్యూరిటీ గార్డుగా మారాడు. 2022 వరకు అతను సెక్యూరిటీ గార్డ్‌గానే తన జీవనాన్ని కొనసాగించాడు.
అయితే చిన్నప్పటి నుంచి క్రికెట్ మీద ఆసక్తి ఉన్న షమర్.. పేస్ బౌలింగ్‌లో నైపుణ్యం సంపాదించాడు. వెస్టిండీస్ ప్లేయర్ రొమారియో షెఫర్డ్‌తో ఉన్న పరిచయం అతని జీవితాన్ని మార్చేసింది.
గయానా జట్టు కోచ్ దృష్టిలో పడ్డ అతను సెక్యూరిటీ గార్డుగా పని చేస్తూనే సెలెక్షన్స్ ట్రయల్స్‌కు వెళ్లాడు. అక్కడ సత్తా చాటి డివిజన్-1 క్రికెట్‌లో అవకాశం సంపాదించాడు. అక్కడ తొలి మ్యాచ్‌లోనే 6 వికెట్లు తీసి.. కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో నెట్‌బౌలర్‌గా అవకాశం అందుకున్నాడు. అదే సమయంలో దిగ్గజ బౌలర్ ఆంబ్రోస్.. అతని బౌలింగ్‌కు ఫిదా అయ్యి ప్రోత్సహించాడు.
అతని సహకారంతో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌తో పాటు సీపీఎల్‌లో సత్తా చాటి వెస్టిండీస్ జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియాతో ఆడిన తన తొలి సిరీస్‌లోనే సంచలన ప్రదర్శన కనబర్చి స్టార్‌గా మారాడు. ఐపీఎల్ ద్వారా లభించే డబ్బుతో అతని జీవితం పూర్తిగా మారిపోనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications